ఏలూరు, జూలై 29: విద్యార్థుల్లో నేరాలపై అవగాహన పెంపొందించి, అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలనే అంశాలపై ఏలూరు రూరల్ పోలీసులు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఏలూరు రూరల్ పరిధిలోని పొణంగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డయల్ 112, శక్తి యాప్‌తో పాటు పలు అత్యవసర హెల్ప్‌లైన్‌ల వినియోగంపై విద్యార్థులకు వివరించారు.
ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఏలూరు డీఎస్పీ డి. శ్రావణ్ కుమార్ ఆదేశాల మేరకు ఏలూరు వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ రామకృష్ణ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. ఏలూరు రూరల్ ఎస్సై వి. వెంకటేశ్వరరావు తమ సిబ్బందితో కలిసి విద్యార్థులకు పలు కీలక అంశాలపై అవగాహన కల్పించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు అందుబాటులో ఉండే ముఖ్యమైన హెల్ప్‌లైన్ నంబర్ల వినియోగాన్ని పోలీసులు వివరించారు.
డయల్ 112: పోలీసు, అగ్నిమాపక, వైద్య అత్యవసర సేవల కోసం
డయల్ 1098: పిల్లల రక్షణ, వారి సమస్యల పరిష్కారం కోసం చైల్డ్ హెల్ప్‌లైన్
డయల్ 1072: మత్తు పదార్థాల అక్రమ రవాణా లేదా విక్రయాలపై పోలీసులకు సమాచారం అందించేందుకు. అని వివరించారు.
అలాగే శక్తి యాప్ వినియోగంపై డెమో కూడా చూపించారు.
మహిళలు, బాలికల భద్రత కోసం ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ రూపొందించిన శక్తి యాప్ ఉపయోగాలు, స్మార్ట్‌ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకునే విధానం, అత్యవసర సమయంలో ఎస్‌వోఎస్ (SOS) బటన్‌ను ఎలా ఉపయోగించాలో ముఖ్యంగా బాలికలకు ప్రత్యక్ష ప్రదర్శన ద్వారా వివరించారు.
సైబర్ నేరాలకు దూరంగా ఉండాలి
విద్యార్థి దశలో చదువుపై పూర్తి దృష్టి పెట్టాలని, సైబర్ నేరాలు, మత్తు పదార్థాలు, ఇతర చెడు అలవాట్లకు దూరంగా ఉండి క్రమశిక్షణతో ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని ఎస్సై వెంకటేశ్వరరావు సూచించారు.




















