ఓలా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ విడుదల.. 301 కి.మీ రేంజ్‌తో ఎస్1జెడ్‌

భారత్‌లో ఎలక్ట్రిక్‌ స్కూటర్ల మార్కెట్‌లో ఓలా ఎలక్ట్రిక్‌ కొత్త ఎస్1జెడ్‌ శ్రేణిని విడుదల చేసింది. దేశీయంగా అభివృద్ధి చేసిన భారత్‌ సెల్‌ ఎల్‌ఎఫ్‌పీ బ్యాటరీ సాంకేతికతతో రూపొందించిన ఈ స్కూటర్‌ రెండు బ్యాటరీ వేరియంట్లలో లభిస్తుంది. ప్రారంభ ధర రూ.79,999 కాగా.. గరిష్ఠంగా 301 కిలోమీటర్ల వరకు రేంజ్‌ అందిస్తుందని కంపెనీ పేర్కొంది.

28 ఆగస్టు, 2026 5:42 PM•ByNarender Kumar Nangunoori

Share this article

ఓలా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ విడుదల.. 301 కి.మీ రేంజ్‌తో ఎస్1జెడ్‌

భారత్‌లో ఎలక్ట్రిక్‌ స్కూటర్ల విభాగంలో ఓలా ఎలక్ట్రిక్‌ మరో కొత్త ఉత్పత్తిని తీసుకొచ్చింది. ఎస్1జెడ్‌ (S1 Z) పేరుతో కొత్త స్కూటర్‌ శ్రేణిని విడుదల చేసింది. దేశీయంగా అభివృద్ధి చేసిన భారత్‌ సెల్‌ ఎల్‌ఎఫ్‌పీ (LFP) బ్యాటరీ సాంకేతికతను భారీ మార్కెట్‌కు తీసుకొచ్చిన తొలి స్కూటర్‌ శ్రేణి ఇదేనని కంపెనీ తెలిపింది.

ఎస్1జెడ్‌లో ఉపయోగించిన 46-సిరీస్‌ ఎల్‌ఎఫ్‌పీ సెల్‌ ప్లాట్‌ఫామ్‌ను ఓలా ఎలక్ట్రిక్‌ బ్యాటరీ ఇన్నోవేషన్‌ సెంటర్‌లో అభివృద్ధి చేసింది. ఈ సెల్స్‌ను కంపెనీకి చెందిన ఓలా గిగాఫ్యాక్టరీలో తయారు చేస్తున్నారు. అందుబాటు ధరల విభాగంలోని వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని స్కూటర్‌ను రూపొందించినట్లు కంపెనీ వెల్లడించింది.

రెండు బ్యాటరీ వేరియంట్లు.. ధర ఎంత?

ఓలా ఎస్1జెడ్‌ రెండు బ్యాటరీ సామర్థ్యాల్లో లభిస్తుంది.

3.1 kWh బ్యాటరీ: రూ.79,999 (ఎక్స్‌-షోరూమ్‌)

5.1 kWh బ్యాటరీ: రూ.99,999 (ఎక్స్‌-షోరూమ్‌)

3.1 kWh వేరియంట్‌ ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే ఇండియన్‌ డ్రైవింగ్‌ సైకిల్‌ ప్రకారం గరిష్ఠంగా 179 కి.మీ ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది. 5.1 kWh వేరియంట్‌ గరిష్ఠంగా 301 కి.మీ రేంజ్‌ అందిస్తుందని పేర్కొంది. దేశీయంగా ఎల్‌ఎఫ్‌పీ సెల్‌ సాంకేతికతను అభివృద్ధి చేసి, తయారు చేయడం ద్వారా బ్యాటరీ ఖర్చులను తగ్గించగలిగామని ఓలా తెలిపింది. దీంతో మెరుగైన భద్రత, ఎక్కువ జీవితకాలం కలిగిన బ్యాటరీ సాంకేతికతను అందుబాటు ధరలో అందించగలుగుతున్నామని పేర్కొంది.

స్మార్ట్‌ ఫీచర్లకు పెద్దపీట

ఎస్1జెడ్‌ స్కూటర్‌లో MoveOS 5 సాఫ్ట్‌వేర్‌ను అందిస్తున్నారు. క్రూయిజ్‌ కంట్రోల్‌, అధునాతన రీజెనరేటివ్‌ బ్రేకింగ్‌, రివర్స్‌ మోడ్‌, GPS, OTA సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్స్‌, జియో ఫెన్సింగ్‌, టైమ్‌ ఫెన్సింగ్‌, మోడ్‌ ఫెన్సింగ్‌ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అంతేకాకుండా ఓలా యాప్‌ ద్వారా రైడ్‌ గణాంకాలు, ఎనర్జీ వినియోగ వివరాలను కూడా తెలుసుకోవచ్చు. దీంతో స్కూటర్‌ అనుభవాన్ని మరింత స్మార్ట్‌, కనెక్టెడ్‌గా మార్చినట్లు కంపెనీ తెలిపింది.

ఈజీ పార్క్‌ ఫీచర్‌..

ఎస్1జెడ్‌ శ్రేణిలో ఈజీ పార్క్‌ ఫీచర్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇరుకైన ప్రదేశాల్లో స్కూటర్‌ను ముందుకు, వెనక్కి సులభంగా కదిలించేందుకు ఈ ఫీచర్‌ ఉపయోగపడుతుంది. రిస్ట్‌ను తిప్పడం ద్వారా వాహనాన్ని నియంత్రించేలా దీన్ని రూపొందించారు. అన్ని వేరియంట్లలో 12-అంగుళాల వీల్స్‌ అందిస్తున్నారు. వైట్‌, ఆంత్రాసైట్‌, స్కై స్ప్లాష్‌ బ్లూ, మ్యాచ్‌ గ్రీన్‌ రంగుల్లో స్కూటర్‌ లభిస్తుంది.

డెలివరీలు ఎప్పటి నుంచి?

3.1 kWh ఎస్1జెడ్‌ వేరియంట్‌ డెలివరీలు 2026 డిసెంబర్‌లో ప్రారంభం కానున్నాయి. 5.1 kWh వేరియంట్‌ డెలివరీలు 2027 మార్చిలో ప్రారంభమవుతాయని ఓలా ఎలక్ట్రిక్‌ తెలిపింది.

ఓలా ఎలక్ట్రిక్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ భావిష్‌ అగర్వాల్‌ మాట్లాడుతూ.. దేశీయంగా అభివృద్ధి చేసిన ఎల్‌ఎఫ్‌పీ సాంకేతికత సాధారణ వినియోగదారులకు అందుబాటులోకి రావడమే దాని విజయానికి అసలైన కొలమానమని అన్నారు. అందుబాటు ధర అంటే సాంకేతికత, భద్రత, సౌకర్యాల్లో రాజీ పడటం కాదని పేర్కొన్నారు. ఎస్1జెడ్‌ పేరులోని ‘Z’ అంటే ‘జ్యాదా’ (ఎక్కువ) అని ఓలా వివరించింది. ఎక్కువ భద్రత, ఎక్కువ రేంజ్‌, ఎక్కువ సాంకేతికత, ఎక్కువ విలువను అందించాలనే ఉద్దేశంతో ఈ స్కూటర్‌ను రూపొందించినట్లు తెలిపింది. రిటైల్‌ విస్తరణలోనూ ఎస్1జెడ్‌ కీలక పాత్ర పోషించనుంది. సొంత రిటైల్‌ నెట్‌వర్క్‌తో పాటు డీలర్ల ద్వారా నిర్వహించే స్టోర్లను కూడా ప్రారంభించాలని ఓలా భావిస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా మరింత మంది వినియోగదారులకు తమ ఉత్పత్తులను చేరువ చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు