నేపాల్: నేపాల్-టిబెట్ సరిహద్దు ప్రాంతంలో వరదలు తీవ్ర బీభత్సం సృష్టించాయి. భారీ వరదల కారణంగా ఇప్పటివరకు 552 మంది మృతి చెందారు. వీరిలో 547 మంది మృతుల వివరాలను నేపాల్ ప్రభుత్వం వెల్లడించగా.. మరో ఐదు మరణాలను చైనా మీడియా ధ్రువీకరించింది. ఈ విపత్తులో 1,400 మందికి పైగా గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. వీరిలో 178 మంది భారతీయులు సహా మొత్తం 644 మంది గల్లంతైన వారి వివరాలను నేపాల్ పోలీసులు వెల్లడించారు. గల్లంతైన వారిలో ఇతర దేశాలకు చెందిన వారు కూడా ఉన్నారు. తాజాగా వారి జాబితాను అధికారులు విడుదల చేశారు.
మరోవైపు.. నేపాల్‌లో సుమారు 320 మంది భారతీయులు గల్లంతైనట్లు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. మరో 100 మంది భారత సంతతి వ్యక్తుల ఆచూకీ కూడా తెలియడం లేదని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల నుంచి తమిళనాడుకు చెందిన 21 మంది భారతీయులు సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నట్లు ఆయన చెప్పారు. అలాగే త్రిశూలీ పవర్ ప్రాజెక్టులో పనిచేస్తున్న 63 మంది భారతీయులు క్షేమంగా ఉన్నారని వెల్లడించారు.
ఇక వరదల కారణంగా చైనాలో చిక్కుకున్న సుమారు 400 మంది భారతీయులు కూడా సురక్షితంగానే ఉన్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది. వారిలో చాలామంది హెల్ప్‌లైన్‌ల ద్వారా భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించినట్లు పేర్కొంది. ఇప్పటికే 96 మంది నేపాల్‌కు చేరుకున్నారని.. వారిని భారత్‌కు తరలించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని రణధీర్ జైస్వాల్ తెలిపారు. మిగిలిన భారతీయులను కూడా సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడానికి నేపాల్, చైనా అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. అయితే, వరదల్లో మృతి చెందినవారు, గల్లంతైనవారి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

























