న్యూఢిల్లీ, అక్టోబర్ 2 (జనవాణి): ఫ్లైదుబాయ్ విమానాన్ని ప్రమాదం నుంచి కాపాడిన కెప్టెన్ స్మిత్ మచ్చర్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం వీడియో కాల్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా కెప్టెన్ ధైర్యం, సహనం, సమయస్ఫూర్తిని ప్రధాని అభినందించారు.
గత బుధవారం ఉదయం దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు బయలుదేరిన ఫ్లైదుబాయ్ విమానంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. విమానం గాల్లో ఉండగా సహ పైలట్ కెప్టెన్ స్మిత్‌పై కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడినప్పటికీ కెప్టెన్ పరిస్థితిని అదుపులోకి తీసుకుని విమానంలోని 173 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడారు. చికిత్స పొందుతున్న కెప్టెన్ స్మిత్‌తో మాట్లాడిన ప్రధాని మోదీకి ప్రమాద సమయంలో ఎదురైన పరిస్థితులను ఆయన వివరించారు.
‘ఇదే చివరి అవకాశం అనుకున్నా’
తాను 17 ఏళ్లుగా విమానాలు నడుపుతున్నానని, గత 11 ఏళ్లుగా కెప్టెన్‌గా పనిచేస్తున్నానని స్మిత్ తెలిపారు. విమానంలో ఏం జరుగుతుందో అనుభవంతో అర్థం చేసుకోగలనని చెప్పారు. నేను కింద పడిపోయినప్పుడు విమానం వేగంగా కిందికి వెళ్తున్నట్లు అనిపించింది. ఆ సమయంలో ఏమీ చేయకుండా ఉంటే అందరి ప్రాణాలు పోతాయని అర్థమైంది. ఇదే చివరి అవకాశం అనుకున్నా. ఎలాగోలా కాక్‌పిట్ తలుపు తెరిచాను. ఆ తర్వాత ప్రయాణికులు, సిబ్బంది సహకరించారు. విమానంలోని ఒక్క ప్రాణాన్ని కూడా పోనివ్వలేదు అని స్మిత్ వివరించారు.
భయపడినప్పుడు హనుమాన్ చాలీసా పఠిస్తా
ప్రమాద సమయంలో తాను హనుమాన్ చాలీసా జపించానని కెప్టెన్ స్మిత్ ప్రధాని మోదీకి తెలిపారు. దేవుడే తనను కాపాడాడని భావిస్తున్నట్లు చెప్పారు. తన రెండేళ్ల కుమారుడికి ప్రతిరోజూ ఉదయం హనుమాన్ చాలీసా చదివి వినిపిస్తానని వెల్లడించారు. దేశానికి దూరంగా ఉన్నప్పటికీ భారతీయ సంస్కృతికి దూరం కాకూడదనే ఉద్దేశంతో తన కుమారుడికి హనుమాన్ చాలీసా నేర్పిస్తున్నట్లు స్మిత్ తెలిపారు.
కెప్టెన్ స్మిత్ ధైర్యాన్ని మోదీ ప్రశంసలు
కెప్టెన్ స్మిత్‌తో మాట్లాడిన ప్రధాని మోదీ ఆయన ధైర్యాన్ని ప్రత్యేకంగా ప్రశంసించారు. తీవ్ర గాయాలతో ప్రాణాల కోసం పోరాడుతున్న సమయంలోనూ ప్రయాణికుల భద్రత గురించి ఆలోచించడం అసాధారణమని పేర్కొన్నారు. స్మిత్ ధైర్యం, సహనం, సమయస్ఫూర్తి ఎంతోమంది ప్రాణాలను కాపాడాయని మోదీ అన్నారు. ఆయన చేసిన సాహసోపేతమైన ప్రయత్నాన్ని 140 కోట్ల మంది భారతీయులు గర్వంగా చూస్తున్నారని తెలిపారు.
Loading Tweet...




















