దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లై దుబాయ్ ఎఫ్‌జెడ్1073 విమానంలో బుధవారం అనూహ్య ఘటన చోటుచేసుకుంది. విమానం గాల్లో ఉండగా ఓ వ్యక్తి కాక్‌పిట్‌పై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చార్, కో-పైలట్ తీవ్రంగా గాయపడ్డారు.
తల, చేతులకు తీవ్ర గాయాలు
కాక్‌పిట్ నుంచి కేకలు వినిపించడంతో విమానంలో ఉన్న ఇజ్రాయెల్ దంత వైద్యుడు డాక్టర్ షోటా మొసావ్ వెంటనే అక్కడికి వెళ్లారు. అప్పటికే మచ్చార్ తీవ్ర గాయాలతో భారీగా రక్తస్రావమవుతూ కనిపించారని ఆయన తెలిపారు. పైలట్ తల, చేతులకు దాదాపు తెగిపోయేంత తీవ్ర గాయాలయ్యాయని మొసావ్ వివరించారు. అధికంగా రక్తం పోవడంతో మచ్చార్ రక్తపోటు పడిపోతూ కొద్దిసేపటికే స్పృహ కోల్పోయారని చెప్పారు.
రక్తస్రావాన్ని నియంత్రించిన డెంటిస్ట్
విమానంలో తాను మాత్రమే వైద్యుడినని చెప్పిన మొసావ్ పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే ప్రాథమిక చికిత్స ప్రారంభించారు. ముందుగా రక్తస్రావాన్ని నియంత్రించేందుకు చర్యలు చేపట్టి, అనంతరం రక్తపోటును స్థిరీకరించేందుకు ప్రయత్నించారు. చికిత్సకు పైలట్ స్పందించడంతో ఆయన పరిస్థితి కొంత మెరుగుపడిందని తెలిపారు. తర్వాత విమానాన్ని సౌదీ అరేబియాలోని టబుక్‌కు అత్యవసరంగా మళ్లించారు. అక్కడ విమానం సురక్షితంగా ల్యాండ్ అయిన అనంతరం మచ్చార్‌ను ఆసుపత్రికి తరలించి శస్త్రచికిత్స నిర్వహించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు భారత రాయబార కార్యాలయం వెల్లడించింది.

దుండగుడిని కట్టేసిన ప్రయాణికులు
కాక్‌పిట్‌పై దాడి చేసిన వ్యక్తిని ప్రయాణికులు కలిసి అదుపులోకి తీసుకున్నారు. తొలుత హెడ్‌ఫోన్స్ వైర్‌తో అతడిని కట్టివేసి, అనంతరం ప్లాస్టిక్ జిప్ టైలను ఉపయోగించినట్లు మొసావ్ తెలిపారు. తీవ్రంగా గాయపడినప్పటికీ మచ్చార్ తన చివరి శక్తిని కూడదీసుకుని కాక్‌పిట్ తలుపు తెరిచినట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రతినిధి వెల్లడించారు. దీంతో ప్రయాణికులు పరిస్థితిని గుర్తించి కాక్‌పిట్‌లోకి ప్రవేశించి దుండగుడిని అదుపులోకి తీసుకున్నారు. విమానంలో ఉన్న ఆఫ్ డ్యూటీ ఫ్లైదుబాయ్ పైలట్లు కూడా అనంతరం విమాన నియంత్రణలో సిబ్బందికి సహకరించారు.
30 సెకన్లలో 14 వేల అడుగులు కిందకు!
కాక్‌పిట్‌లో అత్యవసర పరిస్థితి తలెత్తిన వెంటనే విమానం నుంచి ఎమర్జెన్సీ సిగ్నల్స్ వెలువడ్డాయి. ఆ సమయంలో విమానం కేవలం 30 సెకన్లలో దాదాపు 14 వేల అడుగుల మేర కిందకు దిగినట్లు సమాచారం. విమానాశ్రయ అధికారులు ఉదయం 8.44 గంటలకు డిస్ట్రెస్ కాల్ అందుకున్నామని, అనంతరం 9.45 గంటలకు విమానం టబుక్‌లో సురక్షితంగా ల్యాండ్ అయిందని తెలిపారు.
దాడికి కారణం ఏమిటి?
ఈ ఘటనలో కెప్టెన్ మచ్చార్‌తో పాటు కో-పైలట్ కూడా గాయపడ్డారు. కో-పైలట్ ఒమన్‌కు చెందిన వ్యక్తిగా సమాచారం. దాడికి పాల్పడిన వ్యక్తిని సౌదీ అధికారులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే కాక్‌పిట్‌పై దాడికి గల కారణం ఇప్పటివరకు స్పష్టంగా తెలియరాలేదు. విమానంలో సుమారు 174 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఘటన అనంతరం ప్రయాణికులను ప్రత్యామ్నాయ విమానాల్లో ఇజ్రాయెల్‌కు తరలించారు.




















