Retrofit | దేశంలో వేగంగా పెరుగుతున్న సెకండ్‌హ్యాండ్ కార్ల మార్కెట్‌ను కాలుష్యానికి కారణంగా కాకుండా, పరిశుభ్రమైన రవాణాకు వేదికగా మార్చాలని ఇండియన్ ఆటో ఎల్పీజీ కోలిషన్ (ఐఏసీ) కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఇప్పటికే రోడ్లపై తిరుగుతున్న పెట్రోల్, డీజిల్ కార్లను సురక్షితంగా ఆటో ఎల్పీజీకి మార్చుకునేలా నిర్దిష్ట గడువుతో కూడిన జాతీయ ‘రెట్రోఫిట్ పాలసీ’ తీసుకురావాలని ప్రతిపాదించింది. దాంతో ఢిల్లీ–ఎన్‌సీఆర్‌తో పాటు కాలుష్య సమస్య తీవ్రంగా ఉన్న నగరాల్లో వాయు కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు ప్రజలకు తక్కువ ఖర్చుతో కూడిన ప్రత్యామ్నాయ ఇంధనం అందుబాటులోకి వస్తుందని పేర్కొంది.
రెట్రోఫిట్ పాలసీ ఎందుకు?
దేశంలో కొత్త కార్ల కంటే సెకండ్‌హ్యాండ్ కార్ల విక్రయాలే వేగంగా పెరుగుతున్నాయని ఐఏసీ వెల్లడించింది. ప్రస్తుతం ఏటా సుమారు 60 లక్షల వాడిన కార్లు విక్రయమవుతున్నాయని, 2023లో ఈ సంఖ్య 46 లక్షలు కాగా, 2030 నాటికి కోటి వాహనాలను దాటే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ మార్కెట్ ఏటా 12–13 శాతం సమ్మిళిత వృద్ధి రేటుతో విస్తరిస్తుందని తెలిపింది. ప్రస్తుతం దేశంలో ప్రతి కొత్త కారు విక్రయానికి మించి ఒకటి కంటే ఎక్కువ సెకండ్‌హ్యాండ్ కార్లు చేతులు మారుతున్నాయని పేర్కొంది. రాబోయే సంవత్సరాల్లో కూడా కోట్ల సంఖ్యలో పెట్రోల్, డీజిల్ వాహనాలు రోడ్లపైనే కొనసాగనున్న నేపథ్యంలో, వాటిని స్వచ్ఛమైన ఇంధనమైన ఆటో ఎల్పీజీకి మార్చడం ద్వారా కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించవచ్చని ఐఏసీ అభిప్రాయపడింది. ఇందుకోసం దేశవ్యాప్తంగా ఒకే విధమైన నిబంధనలతో జాతీయ రెట్రోఫిట్ విధానం అమలు చేయాలని, ధ్రువీకరించిన కిట్లతో మాత్రమే మార్పిడి జరిగేలా స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించాలని కోరింది.
పెట్రోల్‌తో పోలిస్తే 40 శాతం ఆదా
ఐఏసీ డైరెక్టర్ జనరల్ సుయాష్ గుప్తా మాట్లాడుతూ.. ఇప్పటికే వినియోగంలో ఉన్న వాహనాల్లోనే స్వచ్ఛమైన ఇంధనాన్ని ప్రోత్సహించడం ద్వారా పట్టణాల్లో గాలి నాణ్యతను వేగంగా మెరుగుపరచవచ్చన్నారు. ఆటో ఎల్పీజీ ధర పెట్రోల్‌తో పోలిస్తే సుమారు 40 శాతం తక్కువగా ఉంటుందని, కిలోమీటరుకు ఇంధన వ్యయం 40–45 శాతం వరకు తగ్గుతుందని చెప్పారు. ఒక కారును ఆటో ఎల్పీజీకి మార్చేందుకు సుమారు రూ.30 వేల ఖర్చవుతుందని, ఎలక్ట్రిక్ వాహనం కొనుగోలుకు అవసరమయ్యే లక్షల రూపాయలతో పోలిస్తే ఇది ఎంతో చౌకైన పరిష్కారమని వివరించారు. పరిశ్రమలు, అంతర్జాతీయ సంస్థల అధ్యయనాలను ఉటంకిస్తూ.. ఆటో ఎల్పీజీ వాడే వాహనాల్లో కార్బన్ మోనాక్సైడ్, మొత్తం హైడ్రోకార్బన్ ఉద్గారాలు పెట్రోల్ వాహనాలతో పోలిస్తే దాదాపు 50 శాతం వరకు తగ్గుతాయని ఐఏసీ తెలిపింది. నైట్రోజన్ ఆక్సైడ్ (ఎన్‌ఓఎక్స్) ఉద్గారాలు కూడా తగ్గుతాయని, ఈ వాహనాలు బీఎస్–6 ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా పనిచేస్తాయని వెల్లడించింది.
కొత్త మౌలిక సదుపాయాల అవసరం లేదు
దేశంలో ఇప్పటికే ఉన్న ఎల్పీజీ పంపిణీ వ్యవస్థ, రిటైల్ నెట్‌వర్క్‌ను ఉపయోగించుకోవడం ద్వారా ఆటో ఎల్పీజీ అందుబాటును వేగంగా పెంచవచ్చని ఐఏసీ పేర్కొంది. ఇందుకోసం కొత్తగా భారీ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉండదని వివరించింది. రెట్రోఫిట్ విధానంతో పాటు స్పష్టమైన నిబంధనలు రూపొందించాలని, వాహనదారులకు ఆర్థిక ప్రోత్సాహకాలు ఇవ్వాలని, ఆటో ఎల్పీజీ వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలకు అనుగుణంగా ఇంధన విధానాన్ని రూపొందించాలని ఐఏసీ సూచించింది. దీంతో ఇప్పటికే రోడ్లపై ఉన్న వాహనాల నుంచి వెలువడే కాలుష్యం తగ్గడమే కాకుండా, పట్టణాల గాలి నాణ్యత మెరుగుపడుతుందని, ప్రజలకు అందుబాటు ధరలో పరిశుభ్రమైన రవాణా లభిస్తుందని పేర్కొంది.
ఐఏసీ అంటే?
భారత్‌లో ఆటో ఎల్పీజీ వినియోగాన్ని ప్రోత్సహించే ప్రధాన సంస్థే ఇండియన్ ఆటో ఎల్పీజీ కోలిషన్ (ఐఏసీ). ఇందులో ప్రభుత్వ రంగ చమురు సంస్థలు, ప్రైవేటు ఆటో ఎల్పీజీ మార్కెటింగ్ సంస్థలు, ఎల్పీజీ కిట్ సరఫరాదారులు, పరికరాల తయారీ సంస్థలు సభ్యులుగా ఉన్నాయి. ప్రపంచ ఎల్పీజీ అసోసియేషన్, సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (సియామ్)తో కలిసి పనిచేస్తున్న ఈ సంస్థ కేంద్ర మోటార్ వాహన నిబంధనల సాంకేతిక కమిటీ, ఉద్గార చట్టాల కమిటీ, భారత ప్రమాణాల సంస్థ (బీఐఎస్)కు చెందిన టీఈడీ–26 కమిటీ వంటి ప్రభుత్వ కమిటీల్లోనూ భాగస్వామిగా ఉన్నది.




















