Price Hike | దేశవ్యాప్తంగా ఓ వైపు పండుగల సీజన్ మొదలైంది. మరో వైపు నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యుడికి భారంగా మారుతున్నాయి. బలహీన నైరుతి రుతుపవనాలు, అంతర్జాతీయ మార్కెట్‌లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు, నిల్వదారుల అక్రమ నిల్వలు కలిసి ద్రవ్యోల్బణాన్ని మరింత పెంచుతున్నాయి. గత నెల రోజుల్లోనే చక్కెర, బియ్యం ధరలు గణనీయంగా పెరగడం వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తోంది. వినియోగదారుల వ్యవహారాల శాఖ గణాంకాల ప్రకారం.. దేశవ్యాప్తంగా టోకు మార్కెట్‌లో చక్కెర ధర గత నెలలో 5 శాతానికి పైగా పెరిగి క్వింటాలుకు సగటున రూ.4,593కు చేరింది. ఏడాది కాలంతో పోలిస్తే ఇది 7.64 శాతం అధికం. ఇక చిల్లర మార్కెట్‌లో కిలో చక్కెర ధర నెల క్రితం రూ.47.11 ఉండగా, ఆగస్టు 3 నాటికి రూ.49.53కు పెరిగింది.
బియ్యం ధరలకూ రెక్కలు
దేశవ్యాప్తంగా బియ్యం సగటు చిల్లర ధర నెల వ్యవధిలో 2.27 శాతం పెరిగి కిలోకు రూ.45.13కు చేరింది. నెల క్రితం ఇదే ధర రూ.44.13గా ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో బియ్యం ధరలు కిలోకు 10 నుంచి 15 శాతం వరకు పెరిగాయి. దీంతో కుటుంబాల నెలవారీ కిరాణా వ్యయం మరింత పెరుగుతోంది. తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ జయశంకర్ రూపొందించిన పాలసీపత్రంలో కీలక హెచ్చరిక చేసింది. ఎల్‌నినో ప్రభావంతో వరి దిగుబడి తగ్గితే, పలు దేశాలు ముందస్తు జాగ్రత్తగా బియ్యం నిల్వలను పెంచుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. అలాంటి పరిస్థితుల్లో అంతర్జాతీయ మార్కెట్‌లో బియ్యం ధరలు 30 నుంచి 50 శాతం వరకు పెరిగే ప్రమాదం ఉందని అంచనా వేశారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు, ఎరువులు, ఇంధన వ్యయాల పెరుగుదల, ఆసియాలోని ప్రధాన వరి ఉత్పత్తి ప్రాంతాలపై ఎల్‌నినో ముప్పు కలిసి బియ్యం ధరలపై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నాయని నివేదిక పేర్కొంది.
ధరల పెరుగుదలకు కారణాలివే..
మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో పాత చక్కెర నిల్వలు తగ్గిపోవడం, చెరకు నుంచి ఇథనాల్ ఉత్పత్తికి ఎక్కువ మళ్లించడం వల్ల చక్కెర సరఫరా తగ్గింది. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకున్న వ్యాపార వర్గాలు ధరలను మరింత పెంచుతున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. రానున్న పండుగల సీజన్‌లో మిఠాయిలు, బేకరీ ఉత్పత్తులు, ప్రాసెస్డ్ ఆహార పదార్థాల ధరలపై కూడా దీని ప్రభావం పడే అవకాశముంది. బియ్యం ధరల పెరుగుదలకు ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన ప్రతికూల వాతావరణం, తగినంత వర్షపాతం లేకపోవడం, నిల్వదారుల అక్రమ నిల్వలే ప్రధాన కారణాలుగా భావిస్తున్నారు. మార్కెట్‌లో సరఫరా కృత్రిమంగా తగ్గిపోవడంతో ధరలు మరింత పెరుగుతున్నాయి.
రికార్డు స్థాయికి రాగి ధర
అంతర్జాతీయ మార్కెట్‌లో రాగి ధరలు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. లండన్ మెటల్ ఎక్స్చేంజ్‌లో మూడు నెలల రాగి ఫ్యూచర్స్ టన్నుకు 13,842 డాలర్ల గరిష్ఠ స్థాయికి చేరాయి. ప్రపంచ రాగి ఉత్పత్తిలో 20 శాతానికి పైగా వాటా కలిగిన చిలీలో ఆకస్మిక వరదలు, శీతాకాల తుఫాన్లు, భారీ హిమపాతం కారణంగా ప్రధాన గనుల కార్యకలాపాలు నిలిచిపోయాయి. మరోవైపు డేటా సెంటర్లు, విద్యుత్ గ్రిడ్ మౌలిక సదుపాయాల విస్తరణతో డిమాండ్ పెరగడం కూడా ధరల పెరుగుదలకు దోహదపడింది. దీని ప్రభావంతో ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, వాహనాలు, గృహోపకరణాల ధరలు రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.




















