టెలికాం రంగంలో జియోతో, శీతల పానీయాల విభాగంలో కాంపా కోలాతో మార్కెట్‌ను కుదిపేసిన రిలయన్స్.. ఇప్పుడు ఐస్‌క్రీమ్ రంగంలోకి అడుగుపెట్టింది. రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (RCPL) బాంబే క్రీమరీ (Bombay Creamery) పేరుతో కొత్త ఐస్‌క్రీమ్ బ్రాండ్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా కప్పులు, కోన్‌లు, స్టిక్‌లను రూ.10 ప్రారంభ ధరతో అందించాలని నిర్ణయించింది.
రూ.10 ధరే ప్రధాన అస్త్రం
రిలయన్స్ మరోసారి తన తక్కువ ధర వ్యూహాన్నే నమ్ముకుంది. సాధారణంగా మిడ్‌రేంజ్, ప్రీమియం విభాగాల్లో కనిపించే కోన్‌లు, కప్పులు, స్టిక్ ఐస్‌క్రీమ్‌లను తక్కువ ధరకు అందుబాటులోకి తీసుకురావడం ద్వారా వినియోగదారులను ఆకర్షించాలని చూస్తోంది. మొదట పశ్చిమ భారతదేశంలో బాంబే క్రీమరీ (Bombay Creamery) ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకువచ్చి, ఆ తర్వాత దేశవ్యాప్తంగా విస్తరించే ప్రణాళికలో రిలయన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
అమూల్, క్వాలిటీ వాల్స్‌కు సవాల్
భారత ఐస్‌క్రీమ్ మార్కెట్లో ప్రస్తుతం అమూల్, క్వాలిటీ వాల్స్, మదర్ డైరీ, హావ్‌మోర్ వంటి బ్రాండ్లు కీలక స్థానంలో ఉన్నాయి. రిలయన్స్ తక్కువ ధరలో ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకురావడం ఈ కంపెనీలకు గట్టి పోటీగా మారే అవకాశం ఉంది. రిలయన్స్ రిటైల్ స్టోర్లతో పాటు కిరాణా దుకాణాల ద్వారా విక్రయాలను విస్తరించేందుకు భారీ కోల్డ్-చైన్ వ్యవస్థను ఉపయోగించనుంది. దీంతో పట్టణాలతో పాటు చిన్న నగరాలు, గ్రామీణ మార్కెట్లలోనూ బ్రాండ్‌ను వేగంగా విస్తరించే అవకాశం ఉంది.
ప్రస్తుతం చౌకైన ఐస్‌క్రీమ్ రూ.20
ప్రధాన బ్రాండ్లలో ప్రస్తుతం తక్కువ ధరకు లభించే ఐస్‌క్రీమ్‌ల ధర సుమారు రూ.20గా ఉంది. అమూల్ మ్యాంగో ఫ్లేవర్ ఐస్‌క్రీమ్ స్టిక్, కశ్మీరీ కేసర్ కుల్ఫీ స్టిక్ వంటి ఉత్పత్తులు ఈ ధర పరిధిలో లభిస్తున్నాయి. జెప్టో, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, బ్లింకిట్ వంటి క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలోనూ ఇవి విక్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో రిలయన్స్ రూ.10కే ఐస్‌క్రీమ్‌ను అందుబాటులోకి తీసుకురావడం మార్కెట్లో ఆసక్తిని పెంచుతోంది.
జియో, కాంపా కోలా విషయంలో అనుసరించిన తక్కువ ధర వ్యూహాన్ని రిలయన్స్ ఇప్పుడు ఐస్‌క్రీమ్ రంగంలోనూ అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. భారీ పంపిణీ వ్యవస్థ, రిటైల్ నెట్‌వర్క్, తక్కువ ధరను కలిపి మార్కెట్లో తన వాటాను పెంచుకోవాలని సంస్థ ప్రయత్నిస్తోంది. బాంబే క్రీమరీ విజయవంతమైతే భారత ఐస్‌క్రీమ్ మార్కెట్లో ధరల పోటీ మరింత తీవ్రం కావచ్చు. వినియోగదారులకు మాత్రం తక్కువ ధరకే మరిన్ని ఎంపికలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
Loading Tweet...




















