రాకింగ్ స్టార్ యశ్ హీరోగా, గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘టాక్సిక్’ సినిమా విడుదలైన తొలిరోజే భారీ వసూళ్లు సాధించింది. ఈ చిత్రం ఒక్క రోజులోనే సుమారు రూ.104 కోట్లకు పైగా వసూలు చేసినట్లు అన్నామలై పేర్కొన్నారు. అయితే సినిమాపై మరోవైపు విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా సినిమాలోని మితిమీరిన హింస, మహిళలను కించపరిచేలా ఉన్న సన్నివేశాలపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘వీ ద లీడర్స్’ సంస్థ వ్యవస్థాపకుడు, తమిళనాడు బీజేపీ మాజీ నేత కే అన్నామలై స్పందించారు.
సినిమాలో మహిళలను అతిగా లైంగికంగా చూపించడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను ఒకే కోణంలో చూపించే ఇలాంటి చిత్రాలను పిల్లలు చూస్తే.. అవి వారి ఆలోచనా విధానంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని అన్నారు. మహిళల భద్రతపై సమాజంలో అవగాహన పెంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్న సమయంలో.. ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాలకు CBFC ఎలా అనుమతి ఇస్తోంది? అని అన్నామలై ప్రశ్నించారు. సినిమాల్లో మహిళలను గౌరవించే విధంగా చిత్రీకరణ ఉండాలని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా సినిమాల్లో విపరీతమైన హింస, మహిళలను అవమానించేలా చూపించే సన్నివేశాల విషయంలో సెన్సార్ బోర్డు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. పెద్ద హీరోల సినిమాలైనా సరే.. ఏ సన్నివేశాలను అనుమతించాలి, వేటిని తొలగించాలి అనే విషయంలో నిబంధనలను కఠినతరం చేయాలని ఆయన కోరారు.
సినిమా ఎంత పెద్ద నటుడిదైనా.. ప్రేక్షకులపై, ముఖ్యంగా యువతపై దాని ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని సినిమా సర్టిఫికేషన్ ప్రక్రియ మరింత జాగ్రత్తగా, బాధ్యతాయుతంగా ఉండాలని అన్నామలై డిమాండ్ చేశారు.




















