హైదరాబాద్, ఆగస్టు 23 (జనవాణి): రాకింగ్ స్టార్ యశ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ‘టాక్సిక్’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో అపశ్రుతి చోటుచేసుకుంది. మైసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీలో శనివారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో భారీ ఫ్లడ్‌లైట్ స్థంభం ఒక్కసారిగా కూలిపోయింది. స్థంభం కింద పడటంతో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. గాయపడిన వారిని హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘటనతో పాటు కార్యక్రమంలో తొక్కిసలాట చోటుచేసుకోవడంతో పలువురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఈవెంట్ నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలపై మల్లారెడ్డి కాలేజీపై కేసు నమోదు చేశారు. అదే సమయంలో ‘టాక్సిక్’ సినిమా యూనిట్‌పైనా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులు, ఈవెంట్ నిర్వహణలో భద్రతా ఏర్పాట్లు, నిర్వాహకుల నిర్లక్ష్యంపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.




















