‘ఇరుముడి’పై వివాదం.. ప్రభుత్వ స్కూళ్లు, టీచర్లను కించపరిచారంటూ ఆగ్రహం!

రవితేజ నటించిన ‘ఇరుముడి’ మూవీ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న వేళ అనుకోని వివాదంలో చిక్కుకుంది. సినిమాలో ప్రభుత్వ పాఠశాలలు, టీచర్లను కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (APTF) అభ్యంతరం వ్యక్తం చేసింది. వెంటనే ఆ సన్నివేశాలను తొలగించాలని డిమాండ్ చేసింది.

25 ఆగస్టు, 2026 2:54 PM•ByNarender Kumar Nangunoori

Share this article

‘ఇరుముడి’పై వివాదం.. ప్రభుత్వ స్కూళ్లు, టీచర్లను కించపరిచారంటూ ఆగ్రహం!

రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇరుముడి’ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకుంటోంది. ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కేవలం మూడు రోజుల్లోనే రూ.80 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. సోమవారం కలెక్షన్లతో రూ.100 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టిన ఈ సినిమా.. ఫుల్ రన్‌లో రూ.150 కోట్ల మార్క్‌ను అందుకుంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ఈ విజయోత్సాహం మధ్య ‘ఇరుముడి’పై అనుకోని వివాదం చెలరేగింది. సినిమాలో ప్రభుత్వ పాఠశాలలు, టీచర్లను కించపరిచేలా కొన్ని సన్నివేశాలు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (APTF) అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ సన్నివేశాలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేసింది.

టీచర్ పాత్రపై APTF అభ్యంతరం

‘ఇరుముడి’లో నటి స్వాసిక ప్రభుత్వ పాఠశాల టీచర్‌గా కనిపించారు. ఈ పాత్రను నెగెటివ్ షేడ్స్‌లో చూపించారని APTF సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఆమె కనిపించే సన్నివేశాల్లో ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలను పోలిన స్కూల్, అక్కడి విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో ఉపయోగించే యూనిఫామ్‌లో కనిపిస్తారని పేర్కొన్నారు. దీంతో ప్రభుత్వ పాఠశాలలు, ఉపాధ్యాయులపై ప్రతికూల అభిప్రాయం కలిగించేలా ఈ సన్నివేశాలు ఉన్నాయని APTF ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సీన్లను తొలగించాలని చిత్ర బృందాన్ని కోరింది.

Irumudi film 1

ఈ మూవీలో నెగిటివ్ షేడ్స్‌లో ఉన్న ప్రభుత్వ స్కూల్ టీచర్‌ పాత్రలో ఆమె అభినయానికి మంచి మార్కులు పడ్డాయి. ‘ఇరుముడి’ సినిమాకి ఈ సీన్లే కీలకం. కథలో ఈ సన్నివేశాలు కీలకమైన భావోద్వేగాలను మోసుకెళ్తాయని తెలుస్తోంది. ఆ సన్నివేశాలను కట్ చేస్తే, మూవీలో కీలకమైన ఎమోషన్స్‌ మిస్ అవుతాయి. మరి APTF అభ్యంతరాలపై చిత్ర బృందం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.

Irumudi film 2

బాక్సాఫీస్ దగ్గర తగ్గని జోరు

మరోవైపు వివాదం పక్కన పెడితే ‘ఇరుముడి’ వసూళ్లలో దూకుడు కొనసాగుతోంది. రవితేజ గత చిత్రాలకు భిన్నంగా కామెడీ, ఐటెం సాంగ్స్, రొమాంటిక్ సన్నివేశాలకు దూరంగా తెరకెక్కిన ఈ సినిమాకు ఫ్యామిలీ ఆడియెన్స్ నుంచి మంచి స్పందన వస్తోంది. ఆదివారం ఈ సినిమాకు 11 లక్షలకు పైగా టికెట్లు బుక్ కావడం విశేషం. 2026లో ఒకే రోజు అత్యధిక టికెట్లు అమ్ముడైన తెలుగు చిత్రంగా రామ్ చరణ్ ‘పెద్ది’ నెలకొల్పిన రికార్డును ‘ఇరుముడి’ అధిగమించింది. ‘పెద్ది’ మొదటి ఆదివారం 9 లక్షల టికెట్లు అమ్ముడవగా.. ‘ఇరుముడి’ 11 లక్షలకు పైగా టికెట్లతో కొత్త రికార్డు సృష్టించింది. వీకెండ్ ముగిసిన తర్వాత కూడా సినిమా బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా మొదటి రోజు కంటే మొదటి సోమవారం వసూళ్లు ఎక్కువగా రావడం సినిమాపై ఉన్న క్రేజ్‌ను చూపిస్తోంది.

‘టాక్సిక్’తో థియేటర్ల సమస్య?

ఇదిలా ఉంటే ఆగస్టు 26న యష్ హీరోగా గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘టాక్సిక్’ విడుదల కానుంది. ఈ సినిమా రాకతో ‘ఇరుముడి’కి థియేటర్ల కేటాయింపులో కొంత ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. మరి ‘ఇరుముడి’ తన జోరును కొనసాగిస్తుందా? లేక కొత్త విడుదల ప్రభావం పడుతుందా? చూడాలి.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు