సినీ పరిశ్రమలో ఒక్కసారి స్టార్‌డమ్ దక్కితే జీవితం పూర్తిగా మారిపోతుంది. కోట్ల రూపాయల రెమ్యూనరేషన్, విలాసవంతమైన ఇళ్లు, ఖరీదైన కార్లు, లగ్జరీ లైఫ్‌స్టైల్‌తో స్టార్ హీరోలు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటారు. అలాంటి అత్యంత సంపన్న నటుల్లో రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఒకరు. దివంగత నటుడు కృష్ణంరాజు వారసుడిగా 'ఈశ్వర్' సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన ప్రభాస్.. 'వర్షం', 'ఛత్రపతి' సినిమాలతో స్టార్ హీరోగా ఎదిగాడు. అయితే 'బాహుబలి' సిరీస్ ఆయన కెరీర్‌ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లింది. ఆ తర్వాత 'సలార్', 'కల్కి 2898 AD' ఇలా వరుసగా హిట్ల మీద హిట్లతో దూసుకుపోయాడు. మధ్యలో కొన్ని ఫ్లాప్స్ పడ్డా ఆయన కెరీర్ గ్రాఫ్ ఏ మాత్రం తగ్గలేదు.
ప్రభాస్ వ్యక్తిగత ఆస్తుల గురించి కూడా తరచూ చర్చ జరుగుతూనే ఉంటుంది. ఆయన రాజుల కుటుంబానికి చెందిన వారని, కుటుంబ వారసత్వంగా కూడా భారీ స్థాయిలో ఆస్తులు ఉన్నాయని ప్రచారం ఉంది. వివిధ మీడియా కథనాల ప్రకారం ప్రస్తుతం ప్రభాస్ మొత్తం ఆస్తుల విలువ సుమారు రూ.2,000 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా. సినిమాల ద్వారానే వందల కోట్ల రూపాయలు సంపాదించిన ఆయన.. కుటుంబానికి చెందిన వందల ఎకరాల వ్యవసాయ భూములు, గ్రానైట్ వ్యాపారం కూడా ఉన్నట్లు సమాచారం. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబై, పూణే వంటి నగరాల్లో ఖరీదైన ఇళ్లు, ఫామ్ హౌస్‌లు ఉండటంతో పాటు విదేశాల్లో కూడా ఆయనకు ఆస్తులు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.
లగ్జరీ కార్ల విషయంలో కూడా ప్రభాస్ ఏమాత్రం తగ్గరు. ఆయన గ్యారేజీలో రోల్స్ రాయిస్ ఫాంటమ్, లాంబోర్గిని అవెంటాడోర్ రోడ్‌స్టర్, రేంజ్ రోవర్, ల్యాండ్ రోవర్ వంటి అత్యంత ఖరీదైన కార్లు ఉన్నాయి. ఆయన వార్షిక ఆదాయం సుమారు రూ.250 కోట్ల వరకు ఉంటుందని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. సినిమాల రెమ్యూనరేషన్‌తో పాటు బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు, పెట్టుబడుల ద్వారా కూడా ఆయన భారీ ఆదాయం పొందుతున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ప్రభాస్ చేతిలో వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులు ఉన్నాయి. 'ఫౌజీ', 'స్పిరిట్', 'సలార్ 2', 'కల్కి 2' వంటి భారీ బడ్జెట్ చిత్రాలు లైనప్‌లో ఉండటంతో ఆయన కెరీర్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఒక్కో సినిమాతో తన మార్కెట్‌ను పెంచకుంటూ.. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో తిరుగులేని స్టార్ హీరోల్లో ఒకరిగా ప్రభాస్ తన స్థానాన్ని మరింత బలపరుచుకుంటున్నాడు.




















