ప్రభాస్ కెరీర్‌లో బిగ్గెస్ట్ అట్టర్ ఫ్లాప్.. కానీ 5 ఏళ్లుగా ఆ నిర్మాతకు కోట్లు తెచ్చిపెడుతుంది.. ఆ సినిమా ఏదంటే?

ప్రభాస్ సినిమా అంటేనే భారీ ఓపెనింగ్స్.. టాక్‌తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల మోత మోగించగల స్టార్‌డమ్ ఆయన సొంతం. అయితే ప్రభాస్ కెరీర్‌లోనే ఆశించిన స్థాయిలో ఆడని ఓ సినిమా ఇప్పుడు రీ రిలీజ్‌లలో మాత్రం దుమ్మురేపుతోంది. అప్పట్లో డిజాస్టర్‌గా నిలిచిన ఆ మూవీ.. ఏకంగా ఐదేళ్లుగా కోట్లు కొల్లగొడుతోంది. ఇప్పటివరకు రీ రిలీజ్‌ల ద్వారా ఈ సినిమా దాదాపు రూ.5 కోట్ల వరకు వసూలు చేసినట్లు టాలీవుడ్ ట్రేడ్ వర్గాల్లో టాక్. అసలు ఈ సినిమాకు ఇంత క్రేజ్ రావడానికి కారణమేంటి?

13 ఆగస్టు, 2026 9:37 AM•ByLaharika

Share this article

ప్రభాస్ కెరీర్‌లో బిగ్గెస్ట్ అట్టర్ ఫ్లాప్.. కానీ 5 ఏళ్లుగా ఆ నిర్మాతకు కోట్లు తెచ్చిపెడుతుంది.. ఆ సినిమా ఏదంటే?

‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ రేంజ్ ఎక్కడకో వెళ్లిపోయింది. ఆయన సినిమా వస్తుందంటే ఇండియా వైడ్‌గా భారీ హైప్ క్రియేట్ అవుతుంది. ‘బాహుబలి’ ఆయనకు పాన్ ఇండియా స్టార్‌డమ్ తీసుకొచ్చిన మాట వాస్తవమే అయినా.. ఆ స్థాయి ఇమేజ్‌ను ఆ తర్వాత కూడా నిలబెట్టుకోవడం ప్రభాస్ ప్రత్యేకత. ఆయన సినిమాలకు టాక్ ఎలా ఉన్నా ఓపెనింగ్స్ మాత్రం భారీగానే ఉంటున్నాయి.

‘బాహుబలి’ తర్వాత వచ్చిన ‘సాహో’ తెలుగులో ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా.. హిందీలో మాత్రం అదరగొట్టింది. ‘రాధేశ్యామ్’ కూడా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచినప్పటికీ భారీ వసూళ్లను నమోదు చేసింది. ‘ఆదిపురుష్’ తొలి రోజే సుమారు రూ.140 కోట్ల గ్రాస్ సాధించింది. ఇటీవల వచ్చిన ‘ది రాజాసాబ్’ కూడా విడుదలైన రోజే రూ.100 కోట్ల మార్క్‌ను దాటింది. ఈ సినిమాల్లో కొన్ని ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైనా.. వాటి ఓపెనింగ్ నంబర్లు మాత్రం ప్రభాస్ మార్కెట్ ఏ స్థాయిలో ఉందో చెప్పకనే చెబుతున్నాయి. అందుకే ప్రభాస్‌ను బిగ్గెస్ట్ క్రౌడ్ పుల్లర్ అని పిలవడంలో తప్పేమీ లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అయితే భారీ బడ్జెట్, పాన్ ఇండియా సినిమాల వల్లే ప్రభాస్‌కు ఈ స్థాయి కలెక్షన్లు వస్తున్నాయా? అంటే.. ఆయన కెరీర్‌లో పెద్దగా ఆడని సినిమాలు కూడా రీ రిలీజ్‌ల సమయంలో భారీ స్పందన తెచ్చుకుంటున్నాయి. అందుకు మంచి ఉదాహరణ ‘రెబల్’. 2012లో విడుదలైన ఈ సినిమాకు రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించగా, కృష్ణంరాజు కీలక పాత్రలో నటించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మొదటి షో నుంచే నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. సుమారు రూ.45 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ ఫైనల్ రన్‌లో రూ.27 కోట్ల వరకు వసూలు చేసి డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు మిగిల్చినట్లు అప్పట్లో ట్రేడ్ వర్గాల్లో ప్రచారం జరిగింది. అయితే కాలం గడిచే కొద్దీ ‘రెబల్’కు కల్ట్ ఫాలోయింగ్ పెరిగింది.

ఇక ‘రెబల్’ రీ రిలీజ్‌లకు వస్తే సీన్ పూర్తిగా మారిపోయింది. ఈ సినిమా రీ రిలీజ్ హక్కులను ఐదేళ్ల క్రితం తాను తీసుకున్నట్లు నిర్మాత నట్టి కుమార్ వెల్లడించిన విషయం తెలిసిందే. ఏడాదికి పలుమార్లు సినిమాను రీ రిలీజ్ చేస్తున్నామని, ప్రతిసారి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోందని ఆయన తెలిపారు. కొన్ని సందర్భాల్లో హౌస్‌ఫుల్ షోలతో సినిమా మంచి రెవెన్యూ తెచ్చిపెట్టిందని కూడా పేర్కొన్నారు. టాలీవుడ్ ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం ఇప్పటివరకు జరిగిన రీ రిలీజ్‌లన్నింటినీ కలిపి ‘రెబల్’ దాదాపు రూ.5 కోట్ల వరకు వసూలు చేసినట్లు సమాచారం. ఇదే ప్రభాస్ క్రేజ్‌కు మరో ఉదాహరణగా అభిమానులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రభాస్ సందీప్ రెడ్డి వంగాతో ‘స్పిరిట్’ చేస్తూనే, హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’లోనూ నటిస్తున్నాడు. ‘ఫౌజీ’ డిసెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు