హైదరాబాద్, జులై 22: హైదరాబాద్‌లో రౌడీషీటర్ హత్య ఘటనపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రంగా స్పందించారు. తెలంగాణలో శాంతిభద్రతలు పూర్తిగా దిగజారిపోయాయని ఆరోపిస్తూ.. లా అండ్ ఆర్డర్ విషయంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను చూసి సీఎం రేవంత్ రెడ్డి నేర్చుకోవాలని సూచించారు.
మీర్‌పేట్‌లో రౌడీషీటర్ నందనవనం సూరి హత్య ఘటనపై స్పందించిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్.. తెలంగాణలో నేరాలు పెరుగుతున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హత్యలు అధికమయ్యాయని విమర్శించారు.
మీర్‌పేట్‌లో సూరిని దారుణంగా హత్య చేసిన ఘటన రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితిని ప్రతిబింబిస్తోందని అన్నారు. హత్య అనంతరం నిందితుడు సోషల్ మీడియాలో వీడియో కాల్ చేయడం పోలీసులకే సవాల్ విసిరినట్లేనని వ్యాఖ్యానించారు.
హైదరాబాద్‌లో వరుసగా హత్యలు జరుగుతున్నాయని, మహిళలు, వ్యాపారులు కూడా భయాందోళనల మధ్య జీవిస్తున్నారని రాజాసింగ్ ఆరోపించారు. రాష్ట్రంలో నేరాలను అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
లా అండ్ ఆర్డర్‌ను సమర్థంగా నిర్వహించాలంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వద్ద ఉన్న హోంశాఖను సమర్థుడైన వ్యక్తికి అప్పగించాలని సూచించారు. అలాగే ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ అమలు చేస్తున్న విధానాలను అధ్యయనం చేసి, తెలంగాణలో కూడా శాంతిభద్రతలను బలోపేతం చేయాలని కోరారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో సీఎం యోగి ఆదిత్యనాథ్ శాంతిభద్రతలను ఎలా కంట్రోల్ చేస్తున్నారో వెళ్లి తెలుసుకోవాలని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి రాజాసింగ్ సూచించారు. రాష్ట్రంలో నేరాల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు.
ఇదిలా ఉండగా.. మీర్‌పేట్ రౌడీషీటర్ నందనవనం సూరి హత్య కేసులో పాత కక్షలే కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నందనవనం సూరి అనే రౌడీషీటర్ దారుణ హత్యకు గురి కావడం తీవ్ర కలకలం రేపింది. గతంలో తన భార్యతో పాటు సల్మాన్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సూరిపై పలు క్రిమినల్ కేసులు కూడా నమోదు అయ్యాయి. ఈ క్రమంలోనే పోలీసులు అతడిపై నగర బహిష్కరణ కూడా విధించారు. అయితే.. ఇటీవల కుటుంబ సభ్యుల పుట్టినరోజు వేడుకల కోసం రహస్యంగా హైదరాబాద్‌కు వచ్చిన సూరిపై.. గతంలో అతని చేతిలో హత్యకు గురైన సల్మాన్ సోదరుడు అఫ్రోజ్ ప్రతీకార దాడికి పాల్పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ముందుగా సూరి కళ్లలో పేపర్ స్ప్రే చల్లి.. ఆ తర్వాత కత్తితో విచక్షణారహితంగా దాడి చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. తీవ్ర గాయాలతో ఉన్న సూరిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.




















