మీ పేరుపై సిమ్ ఉందా? జాగ్రత్త..
స్మార్ట్‌ఫోన్ వినియోగం పెరిగిన నేపథ్యంలో మొబైల్ సిమ్ కార్డుల దుర్వినియోగం కూడా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర టెలికమ్యూనికేషన్స్ శాఖ (DoT) మొబైల్ వినియోగదారులను అప్రమత్తం చేసింది. ముఖ్యంగా మన పేరుపై తీసుకున్న సిమ్ కార్డులను ఇతరులకు ఇవ్వడం, మన గుర్తింపు పత్రాలను ఉపయోగించి తెలియకుండానే ఇతరులు సిమ్‌లు తీసుకోవడం వంటి వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
టెలికమ్యూనికేషన్స్ చట్టం-2023 ప్రకారం అనధికారికంగా సిమ్ కార్డులు జారీ చేయడం, టెలికాం గుర్తింపులను దుర్వినియోగం చేయడం, మొబైల్ ఫోన్ల IMEI నంబర్లను ట్యాంపరింగ్ చేయడం వంటి నేరాలకు కఠిన శిక్షలు ఉండొచ్చని DoT హెచ్చరించింది. నేరం స్వభావాన్ని బట్టి మూడేళ్ల వరకు జైలు శిక్షతో పాటు భారీ జరిమానా విధించే నిబంధనలు ఉన్నాయి.
చత్తీస్‌గఢ్‌లో వెలుగులోకి వచ్చిన ఘటన
ఇటీవల చత్తీస్‌గఢ్‌లో జరిగిన ఓ ఘటన ఈ సమస్య తీవ్రతను తెలియజేసింది. సైబర్ క్రైమ్ దర్యాప్తులో భాగంగా ఓ సిమ్ విక్రేత (PoS ఏజెంట్) అమాయకుల గుర్తింపు పత్రాలను వారి అనుమతి లేకుండా ఉపయోగించి 25 నకిలీ సిమ్ కార్డులను యాక్టివేట్ చేసినట్లు గుర్తించారు.
దీంతో టెలికాం అధికారులు సదరు ఏజెంట్‌పై చర్యలు తీసుకుని బ్లాక్‌లిస్ట్ చేశారు. రీ-వెరిఫికేషన్‌లో విఫలమైన నంబర్లను కూడా రద్దు చేశారు. ఇలాంటి ఘటనల నేపథ్యంలో వినియోగదారులు తమ పేరుపై ఉన్న మొబైల్ కనెక్షన్లను ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
మీ సిమ్‌ను ఇతరులకు ఇవ్వడం ఎందుకు ప్రమాదకరం?
మన పేరుపై తీసుకున్న సిమ్‌ను బంధువులు, స్నేహితులు లేదా పరిచయస్తులకు ఇచ్చి వినియోగించడం కొందరికి సాధారణ విషయంగానే అనిపించవచ్చు. కానీ ఆ నంబర్‌ను సైబర్ మోసాలు లేదా ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలకు ఉపయోగిస్తే సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అలాగే నకిలీ పత్రాలతో సిమ్ కార్డులు పొందడం, IMEI నంబర్లను మార్చిన పరికరాలు లేదా సిమ్ బాక్స్‌లను ఉపయోగించడం వంటి చర్యలను కూడా చట్టం తీవ్రంగా పరిగణిస్తుంది.
మీ పేరుపై ఎన్ని సిమ్‌లు ఉన్నాయో ఇలా చెక్ చేసుకోండి
మీ గుర్తింపు వివరాలతో ఎన్ని మొబైల్ నంబర్లు జారీ అయ్యాయో తెలుసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ‘సంచార్ సాథి’ (Sanchar Saathi) సేవను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ముందుగా...
sancharsaathi.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లండి.
మీ మొబైల్ నంబర్ ద్వారా అవసరమైన ధృవీకరణ పూర్తి చేయండి.
మీ పేరుపై యాక్టివ్‌గా ఉన్న మొబైల్ కనెక్షన్ల వివరాలను పరిశీలించండి.
మీకు తెలియని లేదా మీరు ఉపయోగించని నంబర్ కనిపిస్తే వెంటనే రిపోర్ట్ చేయండి.
అవసరమైన సందర్భంలో సంబంధిత కనెక్షన్‌ను డిస్‌కనెక్ట్ చేయడానికి చర్యలు తీసుకోవచ్చు.
అంతేకాదు, ఇదే సేవలో ‘Check Genuineness of Your Mobile Handset’ ఆప్షన్ ద్వారా మొబైల్ ఫోన్ IMEI నంబర్‌ను కూడా తనిఖీ చేసుకోవచ్చు.
మీ పేరుపై అనుమానాస్పదంగా ఏదైనా మొబైల్ నంబర్ యాక్టివ్‌గా ఉంటే ఆలస్యం చేయకుండా పరిశీలించడం మంచిది. తెలియని సిమ్‌లు మీకు భవిష్యత్తులో ఇబ్బందులు కలిగించకుండా ముందుగానే అప్రమత్తంగా ఉండటం ముఖ్యం.




















