విదర్భ, ఛత్తీస్‌గఢ్, ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాల ప్రభావంతో గోదావరి నదిలో వరద ఉధృతి రోజురోజుకూ పెరుగుతోంది. శుక్రవారం ఉదయం 10.14 గంటలకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 43 అడుగులకు చేరుకోవడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను ప్రకటించారు.
ఇంద్రావతి, ప్రాణహిత వంటి ఉపనదుల్లో భారీగా వరద నీరు చేరుతుండటంతో గోదావరిలో ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరుతోంది. ముఖ్యంగా ఇంద్రావతి నది నుంచి దాదాపు 10 లక్షల క్యూసెక్కుల వరద నీరు గోదావరిలో కలుస్తుండటంతో దిగువ ప్రాంతాల్లో ప్రవాహం మరింత ఉద్ధృతమవుతోంది. వరద అంచనాల ప్రకారం రాబోయే 24 నుంచి 36 గంటల్లో మేడిగడ్డ, భద్రాచలం ప్రాంతాల్లో గోదావరి ప్రవాహం 12 నుంచి 17 లక్షల క్యూసెక్కులకు చేరే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి, సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ ప్రాజెక్టుల వద్ద కూడా నీటి ప్రవాహం పెరుగుతుండటంతో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
అప్రమత్తమైన యంత్రాంగం
వరద పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని భద్రాచలం సబ్ కలెక్టర్ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. 'గోదావరి ఫ్లడ్ మాన్యువల్' నిబంధనల మేరకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లు, సబ్ కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. ముంపు ప్రభావిత గ్రామాల ప్రజలు, గోదావరి తీర ప్రాంతాల్లో నివసించే వారు అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు.
ఘాట్ల వద్ద భద్రతపై ఆందోళన
గోదావరి వరద ఉద్ధృతి పెరుగుతున్నప్పటికీ భద్రాచలం స్నాన ఘాట్ల వద్ద భద్రతా చర్యలు సరైన స్థాయిలో కనిపించడం లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత రాత్రి నుంచి నీటిమట్టం వేగంగా పెరిగినా, పలువురు భక్తులు ప్రమాదాన్ని పట్టించుకోకుండా నదిలోకి దిగుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.
ఘాట్ల వద్ద ప్రమాద హెచ్చరిక బోర్డులు లేకపోవడం, భక్తులను అప్రమత్తం చేసే గ్రామపంచాయతీ, రెవెన్యూ, పోలీసు సిబ్బంది కనిపించకపోవడం విమర్శలకు దారితీస్తోంది. వరద ఉద్ధృతి మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో మైకింగ్ ద్వారా నిరంతర హెచ్చరికలు జారీ చేయడంతో పాటు, ఘాట్ల వద్ద భద్రతా సిబ్బందిని మోహరించి ప్రమాద సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని భక్తులు, స్థానికులు కోరుతున్నారు.





















