ఉత్తరప్రదేశ్,సెప్టెంబర్ 29 (జనవాణి): ఉత్తరప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో హర్దోయికి చెందిన సూరజ్ తివారీ అనే యువకుడు వర్షాలు కురిపిస్తున్న ఇంద్రుడిపై అధికారులకు ఫిర్యాదు చేయడం ఆసక్తికరంగా మారింది.
ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ఉపయోగించే ‘జన్‌సున్‌వాయి సమాధాన్’ పోర్టల్‌లో సూరజ్ తన ఫిర్యాదును నమోదు చేశాడు. తరచూ భారీ వర్షాలు, ఆ తర్వాత తేలికపాటి వర్షాలు కురుస్తుండటంతో సాధారణ జనజీవనం స్తంభించిపోయిందని పేర్కొన్నాడు. రోడ్లు, వీధులు, లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయని పంటలు దెబ్బతినడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని ఫిర్యాదులో తెలిపాడు. వర్షాల కారణంగా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వెళ్లలేకపోతున్నారని, రోజువారీ పనులు కూడా నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశాడు. వర్షాలతో తాను విసిగిపోయానని, ఇంద్రుడిపై జిల్లా మేజిస్ట్రేట్ చర్యలు తీసుకోవాలని కోరాడు. అంతేకాదు ఇంద్రుడి మొబైల్ నంబర్ తన వద్ద లేదని, అందువల్ల జిల్లా మేజిస్ట్రేటే జోక్యం చేసుకుని వర్షాలు ఆగేలా ఇంద్రుడికి ఆదేశాలు జారీ చేయాలని కోరడం ఫిర్యాదులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
కొద్ది రోజులుగా భారీ వర్షాలు
ఉత్తరప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. హర్దోయిలో వర్షాల కారణంగా ఏడుగురు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. పాముకాటు ఘటనలు కూడా పెరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. వివిధ ప్రాంతాల్లో 30 పశువులు మృతి చెందగా, 330 ఇళ్లు దెబ్బతిన్నాయి. ఇదిలా ఉంటే ఇంద్రుడిపై చర్యలు తీసుకోవాలంటూ సూరజ్ తివారీ చేసిన ఫిర్యాదు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. వ్యవస్థలోని లోపాలు, అధికారుల నిర్లక్ష్యాన్ని వ్యంగ్యంగా ఎత్తిచూపేందుకే సూరజ్ ఈ విధంగా ఫిర్యాదు చేసి ఉండొచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు.




















