వేములవాడ నుంచి బాసరకు డైరెక్ట్ బస్సు.. ప్రారంభించిన మంత్రులు పొన్నం, తుమ్మల

రాజన్న సన్నిధికి వచ్చే భక్తులకు మరింత మెరుగైన రవాణా సౌకర్యం కల్పించే దిశగా వేములవాడ నుంచి కోరుట్ల మీదుగా బాసరకు నేరుగా ఎక్స్‌ప్రెస్ బస్సు సేవలను రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు గురువారం ప్రారంభించారు.

30 జులై, 2026 2:37 PM•ByRamchandram

Share this article

వేములవాడ నుంచి బాసరకు డైరెక్ట్ బస్సు.. ప్రారంభించిన మంత్రులు పొన్నం, తుమ్మల

వేములవాడ నుంచి బాసరకు డైరెక్ట్ ఎక్స్‌ప్రెస్‌ బస్సును జెండా ఊపి ప్రారంభిస్తున్న మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు

వేములవాడ, జూలై 30: రాజన్న సన్నిధికి వచ్చే భక్తులకు మరింత మెరుగైన రవాణా సౌకర్యం కల్పించే దిశగా వేములవాడ నుంచి కోరుట్ల మీదుగా బాసరకు నేరుగా ఎక్స్‌ప్రెస్ బస్సు సేవలను రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు గురువారం ప్రారంభించారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, సంజయ్ కుమార్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, జిల్లా కలెక్టర్ గరీమా అగర్వాల్, ఎస్పీతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

అంతకుముందు శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ గుడి చెరువు బండ్ పార్కును ప్రారంభించిన మంత్రులు.. అనంతరం తిప్పాపూర్ ఆర్టీసీ బస్టాండ్‌ను రూ.1.62 కోట్లతో ఆధునికీకరించే పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేసిందన్నారు. మహాలక్ష్మి పథకం అమలుతో ఆర్టీసీలో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరగడంతో అదనపు బస్సులు కొనుగోలు చేయడంతో పాటు కొత్త సిబ్బందిని కూడా నియమించామని తెలిపారు.

1984లో నిర్మించిన వేములవాడ బస్టాండ్‌కు ఇప్పటివరకు పెద్దగా అభివృద్ధి జరగలేదని, ఇప్పుడు రూ.1.62 కోట్లతో ఆధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. గతంలో ఈ బస్టాండ్‌ను తొలగించే ప్రయత్నాలు జరిగినప్పుడు తాము ప్రజలతో కలిసి పోరాటం చేశామని గుర్తు చేశారు. దక్షిణ కాశిగా పేరొందిన వేములవాడకు ప్రతిరోజూ సుమారు 250 బస్సులు, 560 ట్రిప్పులు నడుస్తున్నాయని, వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో మెరుగైన రవాణా వసతులు కల్పించడం ప్రభుత్వ బాధ్యతగా భావిస్తున్నామని పేర్కొన్నారు. భక్తుల సౌకర్యార్థం వేములవాడ-కోరుట్ల-బాసర ఎక్స్‌ప్రెస్ బస్సును ప్రారంభించామని, గతంలో ముంబైకి కూడా నేరుగా బస్సు సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. ఆర్టీసీని నష్టాల నుంచి గట్టెక్కించి లాభాల బాటలో నడిపిస్తున్నామని, ఉద్యోగులకు ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు.

ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. తిప్పాపూర్ బస్టాండ్ ఆధునికీకరణకు రూ.1.62 కోట్లు మంజూరు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్‌కు నియోజకవర్గ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో బస్టాండ్‌ను తొలగించే ప్రయత్నాలు జరిగాయని, ప్రస్తుత ప్రభుత్వం దానిని ఆధునికీకరించి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తోందన్నారు.

వేములవాడ ఆలయ అభివృద్ధికి రూ.249.40 కోట్లతో పనులు చేపట్టామని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాజన్న క్షేత్రాన్ని దేశంలోనే అత్యుత్తమ ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం, సమృద్ధిగా వర్షాలు కురవాలని రాజరాజేశ్వర స్వామి ఆలయంలో వరుణ యాగం నిర్వహించినట్లు తెలిపారు.

▶CategoriesDistrict, News and Telangana
▶Follow us onFacebook, Twitter & Instagram.
R

Written By

Ramchandram

Newsroom Staff

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు