గోదావరి పుష్కరాలకు ఇప్పటినుంచే పోలీసుల మాస్టర్ ప్లాన్.. సీపీ ఆదేశాలు

గోదావరి పుష్కరాలు-2027ను విజయవంతంగా నిర్వహించేందుకు ఇప్పటి నుంచే పటిష్ట కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య అధికారులను ఆదేశించారు. భక్తుల భద్రత, ట్రాఫిక్, సీసీ కెమెరాలు, అత్యవసర సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

23 జులై, 2026 3:12 PM•ByNarender Kumar Nangunoori

Share this article

గోదావరి పుష్కరాలకు ఇప్పటినుంచే పోలీసుల మాస్టర్ ప్లాన్.. సీపీ ఆదేశాలు

నిజామాబాద్, జూలై 22: రాబోయే గోదావరి పుష్కరాలు-2027 సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లపై బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో పుష్కర ఘాట్ల భద్రత, ట్రాఫిక్ నిర్వహణ, పార్కింగ్, సీసీ కెమెరాలు, ప్రజలకు కల్పించాల్సిన సౌకర్యాలు, అత్యవసర సేవలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. గోదావరి పుష్కరాలు రాష్ట్రంలో అత్యంత ప్రతిష్ఠాత్మక ఆధ్యాత్మిక వేడుకలని, లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ప్రతి అంశాన్ని ముందస్తుగా ప్రణాళికాబద్ధంగా అమలు చేయాలని ఆదేశించారు. ప్రతి పుష్కర ఘాట్‌కు ప్రత్యేక బందోబస్తు ప్రణాళిక రూపొందించి, రద్దీని దృష్టిలో ఉంచుకుని తగిన సంఖ్యలో పోలీసు సిబ్బందిని మోహరించాలని సూచించారు.

భక్తుల రాకపోకలకు అంతరాయం కలగకుండా ప్రత్యేక ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, క్యూ లైన్లు, బ్యారికేడ్లు, హెచ్చరిక బోర్డులు, దిశా నిర్దేశక సూచికలు ఏర్పాటు చేయాలని తెలిపారు. వృద్ధులు, మహిళలు, చిన్నారులు, దివ్యాంగులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించేలా సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.

ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు పుష్కర ఘాట్లకు దూరంగా పార్కింగ్ స్థలాలను గుర్తించి, అక్కడి నుంచి షటిల్ వాహనాల ద్వారా భక్తులను తరలించే విధంగా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. ట్రాఫిక్ మళ్లింపు ప్రణాళికను ముందుగానే సిద్ధం చేసి, ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ సిబ్బందిని మోహరించాలని సూచించారు.

పుష్కర ఘాట్లు, పార్కింగ్ ప్రదేశాలు, ప్రధాన రహదారులు, కూడళ్లలో అధునాతన సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానం చేయాలని తెలిపారు. అవసరమైన చోట డ్రోన్ల ద్వారా పర్యవేక్షణ చేపట్టి జనసమ్మర్థాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేయాలని సూచించారు.

ప్రజలకు సమాచారాన్ని చేరవేసేందుకు పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, డిజిటల్ డిస్‌ప్లే బోర్డులు, హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేయాలని, తప్పిపోయిన చిన్నారులు, వృద్ధుల కోసం ప్రత్యేక సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వైద్య, అగ్నిమాపక, రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్, ఆర్టీసీ, విపత్తు నిర్వహణ తదితర శాఖలతో సమన్వయం పెంచి సంయుక్త కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు.

అలాగే పుకార్లు, తప్పుడు ప్రచారాన్ని అరికట్టేందుకు సోషల్ మీడియా పర్యవేక్షణను బలోపేతం చేయాలని, అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులపై ప్రత్యేక నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించారు. పుష్కరాలకు ముందే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి భక్తులకు సురక్షితమైన, ప్రశాంతమైన, సౌకర్యవంతమైన వాతావరణం కల్పించేలా పనిచేయాలని కమిషనర్ స్పష్టం చేశారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు