కొండగట్టు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం..20 మందికిపైగా ప్రయాణికులకు గాయాలు

కొండగట్టు సమీపంలో జగిత్యాల-కరీంనగర్‌ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్న ఘటనలో 20 మందికిపైగా ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఐదుగురు చిన్నారులు ఉన్నారు.

17 ఆగస్టు, 2026 8:45 PM•ByNarender Kumar Nangunoori

Share this article

కొండగట్టు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం..20 మందికిపైగా ప్రయాణికులకు గాయాలు

కొండ‌గ‌ట్టు, ఆగస్టు 17 (జనవాణి): కొండగట్టు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జగిత్యాల-కరీంనగర్‌ జాతీయ రహదారిపై బల్వంతపూర్‌ అడ్డ రోడ్డు వద్ద సోమవారం సాయంత్రం ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 20 మందికిపైగా ప్రయాణికులు గాయపడగా.. వారిలో ఐదుగురు చిన్నారులు ఉన్నారు.

కరీంనగర్‌-1 డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు 60 మందికిపైగా ప్రయాణికులతో వరంగల్‌ నుంచి నిజామాబాద్‌ వైపు వెళ్తోంది. కొండగట్టు సమీపంలోకి చేరుకోగానే ఎదురుగా వస్తున్న లారీని బస్సు బలంగా ఢీకొట్టింది. దీంతో రెండు వాహనాల ముందు భాగాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. ప్రమాదంలో లారీ డ్రైవర్‌ క్యాబిన్‌లో ఇరుక్కుపోయాడు. స్థానికులు, ఇతర వాహనదారులు తీవ్రంగా శ్రమించి అతడిని బయటకు తీశారు. అనంతరం డ్రైవర్‌తో పాటు గాయపడిన ప్రయాణికులను 108 వాహనాల్లో జగిత్యాల జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. ప్రమాదం కారణంగా జగిత్యాల-కరీంనగర్‌ ప్రధాన రహదారిపై ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విచారణ అనంతరం ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు