పులుల సంరక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలి.. మంత్రి కొండా సురేఖ పిలుపు

పులుల సంరక్షణ పట్ల సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు. ఈ భూమి కేవలం మనుషులకే కాకుండా సమస్త జీవరాశుల ఉమ్మడి ఆవాసమని గుర్తించి ప్రకృతి పరిరక్షణకు అందరూ భాగస్వాములు కావాలని కోరారు.

29 జులై, 2026 7:24 PM•ByRamchandram

Share this article

పులుల సంరక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలి.. మంత్రి కొండా సురేఖ పిలుపు

దూలపల్లిలోని స్టేట్ ఫారెస్ట్ అకాడమీలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతున్న మంత్రి కొండా సురేఖ

హైదరాబాద్, జూలై 29: పులుల సంరక్షణ పట్ల సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు. ఈ భూమి కేవలం మనుషులకే కాకుండా సమస్త జీవరాశుల ఉమ్మడి ఆవాసమని గుర్తించి ప్రకృతి పరిరక్షణకు అందరూ భాగస్వాములు కావాలని కోరారు.

అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా దూలపల్లిలోని తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ అకాడమీలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పులుల ఫోటో ఎగ్జిబిషన్‌ను ఆమె పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. ప్రతి ఏడాది జూలై 29న ప్రపంచ పులుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు. 2010లో రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో ప్రారంభమైన ఈ కార్యక్రమం పులుల సంరక్షణపై ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పించడంలో కీలక వేదికగా నిలిచిందన్నారు. పులి అటవీ సంపదకు ప్రతీక అని, పులిని రక్షించడం అంటే అడవులు, పర్యావరణం, జీవవైవిధ్యం, భావితరాల భవిష్యత్తును కాపాడటమేనని పేర్కొన్నారు.

వేట, అడవుల నరికివేత, అక్రమ రవాణా కారణంగా ఒకప్పుడు పులుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని మార్చేందుకు 1972లో వన్యప్రాణి సంరక్షణ చట్టం, 1973లో 'ప్రాజెక్ట్ టైగర్' ప్రారంభించడం ద్వారా దేశంలో పులుల సంరక్షణకు బలమైన పునాది పడిందన్నారు. ప్రస్తుతం ప్రపంచంలోని పులుల్లో దాదాపు 75 శాతం భారతదేశంలోనే ఉన్నాయని, దేశవ్యాప్తంగా 58 టైగర్ రిజర్వులు విజయవంతంగా పనిచేస్తున్నాయని తెలిపారు.

తెలంగాణలోని అమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వులు దేశంలోనే కీలక పులుల అభయారణ్యాలుగా గుర్తింపు పొందాయని మంత్రి చెప్పారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వులో నీటి వనరుల అభివృద్ధి, ఆవాసాల మెరుగుదల, ఆధునిక రక్షణ చర్యల వల్ల పులుల సంఖ్య పెరుగుతోందన్నారు.

కవ్వాల్ టైగర్ రిజర్వులో పులుల సంఖ్య పెంపునకు టైగర్ రీఇంట్రడక్షన్ కార్యక్రమాన్ని చేపట్టామని, మహారాష్ట్రలోని తడోబా టైగర్ రిజర్వుతో అనుసంధానం చేసి పులుల సహజ సంచారానికి అనుకూల పరిస్థితులు కల్పించినట్లు వివరించారు. పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలను కూడా అటవీ శాఖ విస్తృతంగా నిర్వహిస్తోందన్నారు.

అడవులను కాపాడి, వన్యప్రాణులను సంరక్షించి, భావితరాలకు పచ్చని తెలంగాణను అందించాలని మంత్రి పిలుపునిచ్చారు. అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా అటవీ శాఖతో పాటు ప్రతి పౌరుడు కూడా పులుల సంరక్షణలో తన వంతు బాధ్యత నిర్వర్తించాలని కోరారు.

తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ అకాడమీలో శిక్షణ పొందుతున్న మహారాష్ట్ర, ఒడిశా, మధ్యప్రదేశ్, కేరళ రాష్ట్రాల అభ్యర్థులను ఉద్దేశించి అటవీ సంపద పరిరక్షణలో నిబద్ధత, నిజాయితీ, సేవాభావంతో పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా అటవీ సంపద, వన్యప్రాణుల సంరక్షణలో విశేష సేవలందించిన అటవీ శాఖ ఉద్యోగులను ప్రశంసాపత్రాలు, నగదు బహుమతులతో సత్కరించారు. అలాగే అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన చిత్రలేఖన పోటీల్లో విజేతలైన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు, బహుమతులు అందజేశారు.

R

Written By

Ramchandram

Newsroom Staff

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు