రిటైర్మెంట్ డబ్బుల కోసం గొడవ.. భర్తను రోకలిబండతో కొట్టి చంపిన భార్య

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. రిటైర్మెంట్ అనంతరం వచ్చే డబ్బులు, ఆస్తి పంపకాల విషయంలో భార్యాభర్తల మధ్య తలెత్తిన వివాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఆగ్రహానికి గురైన భార్య రోకలిబండతో భర్త తలపై దాడి చేయడంతో ఆయన మృతి చెందారు.

17 ఆగస్టు, 2026 7:48 PM•ByNarender Kumar Nangunoori

Share this article

రిటైర్మెంట్ డబ్బుల కోసం గొడవ.. భర్తను రోకలిబండతో కొట్టి చంపిన భార్య

సిద్దిపేట, ఆగస్టు 17 (జనవాణి): రిటైర్మెంట్ డబ్బులు, కుటుంబ ఆస్తుల పంపకాల విషయంలో భార్యాభర్తల మధ్య తలెత్తిన వివాదం విషాదాంతమైంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని హనుమాన్ నగర్‌లో భార్య రోకలిబండతో భర్తపై దాడి చేయడంతో ఆయన మృతి చెందారు.

పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. కోటి వెంకటేశ్వర్లు (62) ఆసిఫాబాద్ జిల్లాలో కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. ఆయన భార్య రాజమణి హుస్నాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఏఎన్‌ఎంగా విధులు నిర్వహిస్తున్నారు. వెంకటేశ్వర్లు ఈ నెలాఖరులో ప్రభుత్వ ఉద్యోగం నుంచి పదవీ విరమణ చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రిటైర్మెంట్ అనంతరం అందే ప్రయోజనాలు, కుటుంబ ఆస్తుల పంపకాల విషయంలో దంపతుల మధ్య కొంతకాలంగా విభేదాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆదివారం సాయంత్రం ఇదే అంశంపై ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మాటామాటా పెరగడంతో ఆగ్రహానికి గురైన రాజమణి ఇంట్లో ఉన్న రోకలిబండతో వెంకటేశ్వర్లు తలపై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన ఆయనను కుటుంబ సభ్యులు వెంటనే కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

సమాచారం అందుకున్న పోలీసులు హనుమాన్ నగర్‌లోని నివాసానికి చేరుకుని ఘటనపై వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం హుస్నాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వెంకటేశ్వర్లు తమ్ముడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు రాజమణిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనకు దారితీసిన పూర్తి కారణాలతో పాటు రిటైర్మెంట్ డబ్బులు, ఆస్తి పంపకాలపై దంపతుల మధ్య ఉన్న వివాదంపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు