18 మంది కంటి శస్త్రచికిత్స బాధితులకు రూ.78 లక్షల పరిహారం.. బాధ్యులపై చర్యలకు TGHRC సిఫారసు

హనుమకొండ జయా ఆసుపత్రిలో ‘కంటి వెలుగు’ కింద కంటి శుక్లాల శస్త్రచికిత్సల అనంతరం చూపు కోల్పోయిన 18 మంది బాధితులకు రూ.78 లక్షల పరిహారం చెల్లించాలని TGHRC సిఫారసు చేసింది. వైద్య నిర్లక్ష్యం, ఇన్‌ఫెక్షన్‌ నియంత్రణలో లోపాలను కమిషన్‌ గుర్తించింది.

11 ఆగస్టు, 2026 6:11 PM•ByRalin

Share this article

18 మంది కంటి శస్త్రచికిత్స బాధితులకు రూ.78 లక్షల పరిహారం.. బాధ్యులపై చర్యలకు TGHRC సిఫారసు

హైదరాబాద్, ఆగస్టు 11 (జనవాణి): హనుమకొండలోని జయా ఆసుపత్రిలో ‘కంటి వెలుగు’ కార్యక్రమం కింద కంటి శుక్లాల శస్త్రచికిత్స చేయించుకుని చూపు కోల్పోయిన 18 మంది బాధితులకు రూ.78 లక్షల పరిహారం చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ (TGHRC) సిఫారసు చేసింది. ఆసుపత్రిలో వైద్య నిర్లక్ష్యం, ఇన్‌ఫెక్షన్‌ నియంత్రణలో లోపాలు, సంబంధిత అధికారుల పర్యవేక్షణ వైఫల్యం ఉన్నట్లు కమిషన్‌ నిర్ధారించింది.

డా. జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ HRC No.2975/2018లో జూలై 30, 2026న ఉత్తర్వులు జారీ చేసింది. 2018 సెప్టెంబర్‌ 29న ప్రముఖ దినపత్రికల్లో ప్రచురితమైన వార్తా కథనాల ఆధారంగా ఈ కేసును కమిషన్‌ సుమోటోగా స్వీకరించింది.

జయా ఆసుపత్రిలో తీవ్ర లోపాలు

కేసు విచారణలో ఆరోగ్యశాఖ సమర్పించిన విచారణ నివేదికలు, ఎల్‌.వి. ప్రసాద్‌ కంటి ఆసుపత్రి అందించిన వైద్య రికార్డులు, బాధితులు, వారి కుటుంబ సభ్యుల వాంగ్మూలాలను కమిషన్‌ పరిశీలించింది. ఎల్‌.వి. ప్రసాద్‌ కంటి ఆసుపత్రి నేత్ర వైద్య నిపుణుడు డా. రాజీవ్‌ కె. రెడ్డి పప్పురు సమర్పించిన వివరాలను కూడా పరిగణనలోకి తీసుకుంది.

సమగ్ర విచారణ అనంతరం జయా ఆసుపత్రిలో ఆపరేషన్‌ థియేటర్‌ నిర్వహణ, పరిశుభ్రత, శస్త్రచికిత్స పరికరాల వినియోగం, స్టెరిలైజేషన్‌, ఇన్‌ఫెక్షన్‌ నియంత్రణ, రోగుల భద్రత విషయంలో తీవ్రమైన లోపాలు ఉన్నట్లు కమిషన్‌ నిర్ధారించింది. సంబంధిత అధికారుల పర్యవేక్షణలోనూ వైఫల్యం చోటుచేసుకున్నట్లు పేర్కొంది.

ఇన్‌ఫెక్షన్‌తో చూపు కోల్పోయిన బాధితులు

బాధితులకు Enterobacter Cloacae అనే తీవ్రమైన కంటి ఇన్‌ఫెక్షన్‌ సోకినట్లు కమిషన్‌ తెలిపింది. దీంతో వారు చూపు కోల్పోవడంతోపాటు దీర్ఘకాలిక చికిత్స పొందాల్సి వచ్చిందని పేర్కొంది. ఈ ఘటన కారణంగా బాధితులు తీవ్ర శారీరక, మానసిక వేదనకు గురయ్యారని తెలిపింది.

ఈ నిర్లక్ష్యం బాధితుల జీవించే హక్కు, ఆరోగ్య హక్కు, మానవ గౌరవానికి భంగం కలిగించిందని కమిషన్‌ పేర్కొంది. ఇది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21 కింద హామీ ఇచ్చిన హక్కుల ఉల్లంఘనగా నిర్ధారించింది.

12 మందికి రూ.4 లక్షలు.. ఆరుగురి వారసులకు రూ.5 లక్షలు

మానవ హక్కుల పరిరక్షణ చట్టం-1993లోని సెక్షన్‌ 18 ప్రకారం జీవించి ఉన్న 12 మంది బాధితులకు ఒక్కొక్కరికి రూ.4 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని కమిషన్‌ సిఫారసు చేసింది. కేసు విచారణ పెండింగ్‌లో మరణించిన ఆరుగురు బాధితుల తదుపరి వారసులకు (Next of Kin) ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున పరిహారం అందించాలని సూచించింది.

మొత్తంగా బాధితులకు రూ.78 లక్షల పరిహారం చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కమిషన్‌ సిఫారసు చేసింది.

బాధ్యులపై చర్యలకు సిఫారసు

ఘటనకు బాధ్యులైన వైద్యులు, సిబ్బంది, ఇతర సంబంధిత అధికారులను గుర్తించి.. నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకునేందుకు సమగ్ర విచారణ చేపట్టాలని ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శికి కమిషన్‌ సిఫారసు చేసింది.

కమిషన్‌ చేసిన సిఫారసులను అమలు చేసి, తీసుకున్న చర్యలపై నివేదికను సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించింది.

Ralin

Written By

Ralin

Reporter

Ralin is an experienced journalist with over 12 years of experience in journalism and digital media. Ralin has worked with leading Telugu media organizations, including Eenadu, Andhra Jyothi, and Namasthe Telangana, and specializes in news writing, digital journalism, SEO content, editing, and feature writing.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు