హనుమకొండ, ఆగస్టు 11 (జనవాణి): క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ఉద్యోగుల్లో మానసిక ఉల్లాసం, పరస్పర అనుబంధం పెంపొందుతాయని టీజీఎన్‌పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి అన్నారు. ఉద్యోగులందరూ ఒకే కుటుంబంలా భావించి క్రీడా స్ఫూర్తితో, ఆరోగ్యకరమైన వాతావరణంలో పోటీపడాలని సూచించారు. ఏ సర్కిల్ జట్టు గెలిచినా అది సంస్థ విజయమేనని పేర్కొన్నారు.
హనుమకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియం (జేఎన్‌ఎస్)లో టీజీఎన్‌పీడీసీఎల్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న క్రీడా పోటీలను మంగళవారం సీఎండీ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడలు కేవలం శారీరక దృఢత్వానికే కాకుండా ఉద్యోగుల్లో మానసిక ఒత్తిడిని తగ్గించి నూతనోత్సాహాన్ని నింపుతాయని తెలిపారు. సంస్థలోని ప్రతి ఉద్యోగీ క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్రోత్సహిస్తున్నామని స్పష్టం చేశారు.
ఉద్యోగులంతా ఒక్కటై పోటీల్లో పాల్గొనడం అభినందనీయమన్నారు. ఇలాంటి క్రీడా పోటీలు ఉద్యోగుల మధ్య అనుబంధాన్ని, ఐక్యతను మరింత బలోపేతం చేస్తాయని చెప్పారు. ఉద్యోగుల మధ్య సత్సంబంధాలు, బాండింగ్ పెరిగినప్పుడే సంస్థ పట్ల అంకితభావం పెరుగుతుందని.. తద్వారా వినియోగదారులకు మెరుగైన నాణ్యమైన సేవలు అందించడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. క్రీడల్లో పాల్గొనడం వల్ల వృత్తిపరమైన ఒత్తిడి తగ్గి ఉద్యోగుల పనితీరు మెరుగుపడుతుందని తెలిపారు.
బ్యాడ్మింటన్, క్రికెట్, క్యారమ్స్, చెస్, టేబుల్ టెన్నిస్, వాలీబాల్ పోటీల్లో వివిధ సర్కిళ్లకు చెందిన 150 మందికి పైగా క్రీడాకారులు పాల్గొంటున్నారని సీఎండీ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సంస్థ ఆధ్వర్యంలో తొలిసారిగా క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. సంస్థ ప్రతిష్ఠను పెంచేలా ప్రతి ఏడాది క్రీడలు, సాంస్కృతిక పోటీలను క్రమం తప్పకుండా నిర్వహిస్తామని వెల్లడించారు. క్రీడాకారులకు స్వాతంత్య్ర దినోత్సవం రోజున బహుమతులు అందజేస్తామని తెలిపారు.
కాగా, సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి స్వయంగా క్యారమ్స్ ఆడి ఉద్యోగుల్లో ఉత్సాహం నింపారు. కార్యక్రమంలో డైరెక్టర్లు వి.మోహన్‌రావు, వి.తిరుపతిరెడ్డి, టి.మధుసూదన్, సి.ప్రభాకర్, సీఈలు, స్పోర్ట్స్ కమిటీ సభ్యులు మాధవరావు, వేణుబాబు, హేమంత్‌కుమార్, స్పోర్ట్స్ ఆఫీసర్ ఎన్.జగన్నాథ్, సభ్యులు ప్రేమ్‌కుమార్, యాకుబ్ పాషా తదితరులు పాల్గొన్నారు.





















