ఆసిఫాబాద్, ఆగస్టు 8(జనవాణి): జిల్లా వ్యవసాయ అధికారిని బెదిరించి అక్రమంగా డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నించిన ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఆసిఫాబాద్ డీఎస్పీ బి.అశోక్ తెలిపారు. సోషల్ మీడియా జర్నలిస్టులుగా చెప్పుకుంటూ ఇద్దరూ కుమ్మక్కై వ్యవసాయాధికారిపై ఒత్తిడి తెచ్చి డబ్బులు డిమాండ్ చేసినట్లు దర్యాప్తులో వెల్లడైందన్నారు.
పోలీసుల వివరాల ప్రకారం.. జిల్లా వ్యవసాయ అధికారి బోర్కుట్ వెంకటి ఆగస్టు 5న ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆసిఫాబాద్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. దర్యాప్తులో భాగంగా ఫిర్యాదుదారు, ఇతర సాక్షుల వాంగ్మూలాలు, డిజిటల్ ఆధారాలను పరిశీలించగా.. బుతే దేవేందర్, డుప్త సురేష్ కలిసి వ్యవసాయాధికారిని బెదిరించి డబ్బులు వసూలు చేసేందుకు కుట్ర చేసినట్లు తేలిందని పోలీసులు తెలిపారు.
తొలుత రూ.20 లక్షలు డిమాండ్
రాధిక ట్రేడర్స్ యజమానితో బుతే దేవేందర్‌కు ఉన్న వ్యక్తిగత విభేదాల నేపథ్యంలో ఆ దుకాణాన్ని మూసివేయించేందుకు వ్యవసాయశాఖ అధికారులపై ఒత్తిడి తెచ్చినట్లు పోలీసులు పేర్కొన్నారు. అయితే దుకాణానికి అవసరమైన లైసెన్సులు, సంబంధిత రికార్డులు సక్రమంగా ఉన్నట్లు అధికారుల విచారణలో తేలిందన్నారు. అనంతరం ఇద్దరు నిందితులు ఫోన్ కాల్స్, వీడియోలు, సోషల్ మీడియా పోస్టుల ద్వారా వివిధ కారణాలతో వ్యవసాయాధికారిపై ఒత్తిడి తెచ్చి డబ్బులు డిమాండ్ చేసినట్లు తెలిపారు.
తొలుత రూ.20 లక్షలు డిమాండ్ చేసి.. బెదిరింపుల ద్వారా జులై 26న రూ.1.30 లక్షలు నగదుగా తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ వ్యవహారానికి సంబంధించి వాట్సాప్ చాట్స్, సోషల్ మీడియా పోస్టులు, వీడియోలు, స్క్రీన్‌షాట్లు తదితర డిజిటల్ ఆధారాలను సేకరించినట్లు తెలిపారు. ఆగస్టు 7న ఆసిఫాబాద్ పోలీస్‌స్టేషన్ ఇన్‌స్పెక్టర్, సిబ్బంది హైదరాబాద్‌కు వెళ్లి నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. వారిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించనున్నట్లు చెప్పారు.
నిందితుల్లో ఒకరైన డుప్త సురేష్‌పై గతంలో కాగజ్‌నగర్ సబ్ డివిజన్ పరిధిలోని ఓ పోలీస్‌స్టేషన్‌లో పోక్సో చట్టం కింద కేసు నమోదైనట్లు పోలీసు రికార్డుల పరిశీలనలో వెల్లడైందన్నారు. మైనర్ బాలికకు సంబంధించిన వివరాలు, వీడియోలను సోషల్ మీడియాలో బహిర్గతం చేసిన వ్యవహారంలో ఆ కేసు నమోదై విచారణలో ఉన్నట్లు తెలిపారు.
ప్రభుత్వ ఉద్యోగులను బెదిరించి అక్రమంగా డబ్బులు వసూలు చేసేందుకు నిందితులు తమ వృత్తిని అడ్డుపెట్టుకున్నారన్న ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతోందని డీఎస్పీ అశోక్ తెలిపారు. డిజిటల్ ఆధారాలు, ఆర్థిక లావాదేవీలు, ఫోన్ కాల్స్, ఇతర సాక్ష్యాలను సేకరించి సమగ్రంగా, నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తామని చెప్పారు. నేరం రుజువయ్యేలా తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.





















