సినిమా ప్రమోషన్లు, కమర్షియల్ యాడ్స్‌కు దూరంగా ఉండే కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా ఆయన ఓ రియల్ ఎస్టేట్ సంస్థ కోసం చేసిన ఒక్క నిమిషం యాడ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
నోవా లైఫ్ స్పేస్ (Nova Life Space/Nova Real Estate) సంస్థ కోసం అజిత్ ఈ కమర్షియల్ యాడ్‌లో నటించారు. అయితే ఈ యాడ్ కంటే కూడా అందులో ఆయన తీసుకున్నట్లు ప్రచారం జరుగుతున్న పారితోషికమే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. కేవలం ఒక్క నిమిషం ప్రకటన కోసం అజిత్‌కు రూ.40 కోట్ల రెమ్యునరేషన్ అందినట్లు సోషల్ మీడియాలో కథనాలు చక్కర్లు కొడుతున్నాయి.
అయితే ఈ రూ.40 కోట్ల పారితోషికానికి సంబంధించి అధికారిక ధృవీకరణ మాత్రం లేదు. దీంతో ఈ మొత్తంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు అజిత్‌కు ఉన్న భారీ క్రేజ్, బ్రాండ్ వాల్యూతో పోలిస్తే ఈ మొత్తం పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన విషయం కాదంటూ ఆయన అభిమానులు, సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఈ యాడ్‌కు ప్రముఖ దర్శకుడు ఏఎల్ విజయ్ దర్శకత్వం వహించినట్లు తెలుస్తోంది. ప్రకటనను తెరకెక్కించినందుకు ఆయనకు సుమారు రూ.3 కోట్ల రెమ్యునరేషన్ అందినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే, గతేడాది ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’తో ప్రేక్షకులను అలరించిన అజిత్ ప్రస్తుతం ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రెడ్ డెవిల్’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.




















