గుండెపోటు కాదు.. కార్డియాక్ అరెస్ట్! ఈ తేడా తెలియకే ప్రాణాలు పోతున్నాయి.. CPR ఎప్పుడు చేయాలి?

దేశవ్యాప్తంగా సడెన్ కార్డియాక్ అరెస్ట్ కేసులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. యువకులు, క్రీడాకారులు, ఉద్యోగులు.. రాజకీయ నాయకులు.. ఇలా వయసుతో సంబంధం లేకుండా పలువురు ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు తరచూ కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మొదటి ఐదు నిమిషాలు అత్యంత కీలకం. ఆ సమయంలో సరైన విధంగా CPR (Cardiopulmonary Resuscitation) చేస్తే బాధితుడి ప్రాణాలను కాపాడే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

27 జులై, 2026 10:08 AM•ByLaharika

Share this article

గుండెపోటు కాదు.. కార్డియాక్ అరెస్ట్! ఈ తేడా తెలియకే ప్రాణాలు పోతున్నాయి.. CPR ఎప్పుడు చేయాలి?

representing image of cardiac arrest

ప్రస్తుతం "గుండెపోటు" మరియు "కార్డియాక్ అరెస్ట్" అనే పదాలను చాలా మంది ఒకేలా భావిస్తున్నారు. కానీ వైద్యపరంగా ఇవి పూర్తిగా భిన్నమైన పరిస్థితులు. ఈ తేడా తెలియకపోవడం వల్లే చాలాసార్లు అత్యవసర సమయంలో ఏం చేయాలో తెలియక విలువైన సమయం వృథా అవుతోంది. ఫలితంగా చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు.

గుండెపోటు.. కార్డియాక్ అరెస్ట్‌కు తేడా ఏంటి?

హార్ట్ ఎటాక్ (Heart Attack) అనేది గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళంలో అడ్డంకి ఏర్పడటం వల్ల వస్తుంది. ఈ సమయంలో గుండె పూర్తిగా ఆగిపోదు. వ్యక్తి సాధారణంగా స్పృహలోనే ఉంటాడు. వెంటనే ఆస్పత్రికి తరలించి యాంజియోప్లాస్టీ లేదా ఇతర చికిత్స అందించాలి.

కార్డియాక్ అరెస్ట్ (Cardiac Arrest) మాత్రం పూర్తిగా భిన్నం. ఇందులో గుండె ఒక్కసారిగా కొట్టుకోవడం ఆగిపోతుంది లేదా ప్రమాదకరమైన రీతిలో కొట్టుకోవడం ప్రారంభిస్తుంది. రక్త ప్రసరణ నిలిచిపోవడంతో మెదడుకు ఆక్సిజన్ అందదు. కొన్ని నిమిషాల్లోనే ప్రాణాపాయం ఏర్పడుతుంది. ఇలాంటి సందర్భాల్లో వెంటనే CPR చేయడం అత్యంత కీలకం.

కార్డియాక్ అరెస్ట్‌కు ముందు కనిపించే హెచ్చరికలు

అందరికీ ముందుగా లక్షణాలు కనిపించకపోయినా, కొందరిలో కొన్ని సంకేతాలు కనిపించే అవకాశం ఉంటుంది.

* ఛాతిలో ఒత్తిడి లేదా తీవ్రమైన నొప్పి

* అకస్మాత్తుగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది

* గుండె వేగంగా లేదా అసాధారణంగా కొట్టుకోవడం

* తీవ్రంగా తల తిరగడం

* స్పృహ కోల్పోవడం

* ఒక్కసారిగా కుప్పకూలిపోవడం

* స్పందన లేకపోవడం

* శ్వాస పూర్తిగా ఆగిపోవడం లేదా గ్యాస్‌పింగ్ (Gasping) మాత్రమే ఉండటం

ఈ లక్షణాలు కనిపిస్తే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా అత్యవసర వైద్య సహాయం కోసం 108కు సమాచారం ఇవ్వాలి.

ఎవరికి CPR చేయాలి?
ఛాతి నొప్పి వచ్చిన ప్రతి ఒక్కరికీ CPR చేయాల్సిన అవసరం లేదు. ఈ పరిస్థితుల్లో CPR అవసరం కావచ్చు.

* వ్యక్తి స్పృహ కోల్పోయి స్పందించకపోతే

* శ్వాస తీసుకోకపోతే

* గుండె కొట్టుకోవడం ఆగిపోయిందని అనుమానం ఉంటే

* కార్డియాక్ అరెస్ట్ లక్షణాలు కనిపిస్తే

వ్యక్తి మాట్లాడుతున్నా, శ్వాస తీసుకుంటున్నా, స్పందిస్తున్నా సాధారణంగా CPR అవసరం ఉండదు. అలాంటి సందర్భాల్లో వెంటనే ఆస్పత్రికి తరలించడం ముఖ్యం.

CPR ఎప్పుడు ప్రారంభించాలి?

వైద్య నిపుణుల ప్రకారం కార్డియాక్ అరెస్ట్ జరిగిన మొదటి 3 నుంచి 5 నిమిషాల్లో CPR ప్రారంభిస్తే బాధితుడి ప్రాణాలు దక్కే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయి. ప్రతి నిమిషం ఆలస్యమైతే బతికే అవకాశాలు సుమారు 7 నుంచి 10 శాతం వరకు తగ్గే ప్రమాదం ఉందని పరిశోధనలు సూచిస్తున్నాయి.

CPR ఎలా చేయాలి?

బాధితుడిని గట్టి నేలపై వెల్లకిలా పడుకోబెట్టాలి. ఛాతీ మధ్య భాగంలో రెండు చేతులను ఒకదానిపై ఒకటి ఉంచాలి. నిమిషానికి 100 నుంచి 120 సార్లు వేగంగా, బలంగా ఛాతీని నొక్కాలి. పెద్దవారిలో సుమారు 5 నుంచి 6 సెంటీమీటర్ల లోతు వరకు ఒత్తిడి ఇవ్వాలి. శిక్షణ పొందిన వారు అయితే 30 ఛాతీ మర్దనల తర్వాత రెండు Rescue Breaths ఇవ్వాలి (30:2 నిష్పత్తి). శిక్షణ లేకపోతే కేవలం Hands-only CPR (ఛాతీ మర్దన మాత్రమే) చేసినా ఉపయోగమే.

CPR ఎంతసేపు చేయాలి?

అంబులెన్స్ వచ్చే వరకు CPR ఆపకూడదు. AED (ఆటోమేటెడ్ ఎక్స్‌టర్నల్ డిఫిబ్రిలేటర్) అందుబాటులోకి వచ్చే వరకు చేస్తూనే ఉండాలి. బాధితుడు మళ్లీ శ్వాస తీసుకోవడం ప్రారంభించేంత వరకు చేయాలి.

ఎవరైనా CPR చేయవచ్చా?

CPR చేయడానికి డాక్టర్ కావాల్సిన అవసరం లేదు. దీనిపై శిక్షణ పొందిన ఎవరైనా చేయవచ్చు. అందుకే ప్రపంచవ్యాప్తంగా సాధారణ ప్రజలకు కూడా CPR శిక్షణ ఇవ్వాలని ఆరోగ్య సంస్థలు ప్రోత్సహిస్తున్నాయి.

కార్డియాక్ అరెస్ట్‌కు కారణాలు ఏమిటి?

* అధిక రక్తపోటు

* మధుమేహం

* ఊబకాయం

* ధూమపానం

* మోతాదుకు మించి మద్యపానం సేవించడం

* మానసిక ఒత్తిడి

* కుటుంబంలో గుండె జబ్బుల చరిత్ర

* ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డకట్టడం

* వ్యాయామం లేకపోవడం

* అధికంగా జంక్ ఫుడ్ తీసుకోవడం

ప్రాణాలు కాపాడేది తొలి స్పందనే

సడన్ కార్డియాక్ అరెస్ట్ సంభవించినప్పుడు ఆస్పత్రికి తీసుకెళ్లేలోపు చేసే ప్రాథమిక చర్యలే ప్రాణాలను కాపాడే అవకాశాన్ని నిర్ణయిస్తాయి. అందుకే ప్రతి ఒక్కరూ CPRపై కనీస అవగాహన కలిగి ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అత్యవసర సమయంలో సరైన నిర్ణయం, సరైన పద్ధతిలో ఛాతీ మర్దన చేయడం వల్ల ఒక ప్రాణాన్ని కాపాడే అవకాశం ఉంటుంది.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు