బెంగళూరు,సెప్టెంబర్ 26 (జనవాణి): ఖాళీ స్థలంలో పడివున్న ఓ పాత పరుపు వెనుక దాగిన హత్య కేసు పోలీసుల దర్యాప్తుతో వెలుగులోకి వచ్చింది. పరుపును తరలించేందుకు ప్రయత్నించిన కార్మికులకు అందులోంచి ఓ కాలు కనిపించడంతో భయాందోళనకు గురై పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటన బెంగళూరులోని సంపిగేహళ్లి సమీపంలోని అగ్రహార లేఅవుట్‌లో సెప్టెంబర్ 2న చోటుచేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం.. అగ్రహార లేఅవుట్‌లోని ఓ ఖాళీ స్థలాన్ని కొందరు కార్మికులు శుభ్రం చేస్తున్నారు. అక్కడ పడి ఉన్న పాత పరుపును పక్కకు జరిపే సమయంలో అందులోంచి ఓ కాలు కనిపించింది. దీంతో వెంటనే స్థానికులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బెడ్‌షీట్‌లో చుట్టి తాడుతో గట్టిగా కట్టివేసినట్లు గుర్తించారు. హత్య జరిగి సుమారు 20 రోజులు అయి ఉండొచ్చని ప్రాథమికంగా అంచనా వేశారు. మృతదేహాన్ని గుర్తించడం పోలీసులకు సవాల్‌గా మారింది. అయితే, మృతురాలు ధరించిన దుస్తులపై ఉన్న ట్యాగ్ కీలక ఆధారంగా మారింది. ఆ ట్యాగ్ ఆధారంగా దుస్తులు కొనుగోలు చేసిన దుకాణాన్ని గుర్తించిన పోలీసులు అక్కడి బిల్లు వివరాల ద్వారా మృతురాలు ఒడిశాకు చెందిన 28 ఏళ్ల అనుసూయగా నిర్ధారించారు.
ఆ తర్వాత ఆమె భర్త సాగర్ చంద్ర రావత్ (32)ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా హత్యకు సంబంధించిన వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఒడిశాకు చెందిన అనుసూయ, సాగర్ ప్రేమించుకుని సుమారు రెండేళ్ల క్రితం కుటుంబ సభ్యులకు తెలియకుండా వివాహం చేసుకున్నారు. ఉపాధి కోసం బెంగళూరుకు వచ్చిన ఈ దంపతులు వేర్వేరు హోటళ్లలో పనిచేస్తున్నారు. ఆగస్టు 11న జీతం, అడ్వాన్స్ డబ్బుల విషయంలో భార్యాభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఇంట్లోనూ గొడవ కొనసాగడంతో ఆగ్రహానికి గురైన సాగర్ అనుసూయ గొంతు నులిమి హత్య చేసినట్లు వెల్లడించారు. హత్య అనంతరం మృతదేహాన్ని మూడు రోజుల పాటు ఇంట్లోనే ఉంచినట్లు పోలీసులు తెలిపారు. ఆగస్టు 14 లేదా 16వ తేదీ రాత్రి మృతదేహాన్ని బెడ్‌షీట్‌లో చుట్టి, తాడుతో కట్టి సమీపంలోని ఖాళీ స్థలంలో పడేసినట్లు విచారణలో తేలింది. అనంతరం ఇంటిని ఖాళీ చేసి హోటల్‌లో నివసిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడు తన నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.




















