భారత్‌లో పెరుగుతున్న జీవన వ్యయం, విద్యా ఖర్చుల నేపథ్యంలో పిల్లల పెంపకం వ్యయంపై సోషల్ మీడియాలో ఓ వీడియో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. కంటెంట్ క్రియేటర్ విఖ్యాత్ సింగ్ విడుదల చేసిన ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో ఒక బిడ్డ పుట్టినప్పటి నుంచి 18 ఏళ్ల వరకు పెంచేందుకు సుమారు రూ.1.39 కోట్లు ఖర్చవుతుందని ఆయన అంచనా వేశారు.
వీడియోలో గర్భధారణ నుంచి డెలివరీ వరకు వైద్య పరీక్షలు, ఆస్పత్రి ఖర్చులు, మందులు కలిపి సుమారు రూ.3 లక్షలు అవసరమవుతాయని పేర్కొన్నారు. పుట్టిన తర్వాత తొలి రెండేళ్లలో డైపర్లు, టీకాలు, ఆహారం, ఇతర అవసరాలకు మరో రూ.6 లక్షలు ఖర్చవుతాయని వివరించారు.
రెండేళ్ల నుంచి 18 ఏళ్ల వరకు ఆహారం కోసం సుమారు రూ.15 లక్షలు, ప్లే స్కూల్ నుంచి స్కూల్ విద్య వరకు ఫీజులు, పుస్తకాలు, యూనిఫారాలు, ట్రిప్స్ కలిపి ఇంకో రూ.33 లక్షలు అవసరమవుతాయని లెక్కించారు. ట్యూషన్లకు రూ.9 లక్షలు, ఆరోగ్య సంరక్షణకు రూ.5.4 లక్షలు, ఎంటర్‌టైన్‌మెంట్ కోసం రూ.9 లక్షలు, దుస్తులకు రూ.7.2 లక్షలు, గ్యాడ్జెట్లకు రూ.4 లక్షలు, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలకు రూ.8 లక్షలు, రవాణాకు రూ.8 లక్షలు ఖర్చవుతాయని అంచనా వేశారు.
అదనంగా, పిల్లలతో పెద్ద ఇంట్లో నివసించాల్సి రావడంతో అద్దె రూపంలో సుమారు రూ.32.4 లక్షలు అదనంగా ఖర్చవుతాయని వీడియోలో పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం, ఉన్నత విద్య ఖర్చులు, పెట్టుబడులు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటే ఈ మొత్తం కాస్తా..రూ.2 కోట్లకు మించి వెళ్లే అవకాశముందని కూడా అభిప్రాయపడ్డారు.
ఈ క్రమంలోనే విఖ్యాత్ సింగ్ విడుదల చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ కావడంతో నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లల పెంపకం నిజంగానే ఖరీదైన వ్యవహారంగా మారిందని అభిప్రాయపడుతుండగా, పిల్లల వల్ల కలిగే ప్రేమ, ఆనందం, కుటుంబ బంధాలను డబ్బుతో కొలవలేమని పలువురు నెటిజన్లు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.




















