మధ్యప్రదేశ్,దతియా: అదృష్టం ఉంటె ఎంతటి ప్రమాదం నుంచైనా బయటపడొచ్చనేందుకు ఈ ఘటన నిదర్శనంగా నిలుస్తోంది. మధ్యప్రదేశ్‌లోని దతియాలో ఓ వ్యక్తి తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వీడియోలో ఓ వ్యక్తి రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్నాడు. అతడు కొద్దిగా ముందుకు వెళ్లిన వెంటనే.. రోడ్డుకు పక్కనే ఉన్న భారీ ప్రహరీ గోడ ఒక్కసారిగా కూలిపోయింది. పెద్ద ఎత్తున శిథిలాలు రహదారిపై పడిపోయాయి. అయితే అప్పటికే ఆ వ్యక్తి ప్రమాద ప్రాంతాన్ని దాటేయడంతో పెను ముప్పు తప్పింది. దతియాలో ఇటీవల ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో గోడ పూర్తిగా తడిసి బలహీనపడినట్లు తెలుస్తోంది.
ఈ వీడియో చూసిన నెటిజన్లు.. అతడు కాస్త నెమ్మదిగా నడిచినా పరిస్థితి మరోలా ఉండేదని వ్యాఖ్యానిస్తున్నారు. గోడ కూలిన సమయానికి అతడు అక్కడే ఉండి ఉంటే తీవ్రంగా గాయపడటమో, ప్రాణాలు కోల్పోవడమో జరిగేదని అంటున్నారు. ‘‘అతడు చాలా అదృష్టవంతుడు’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిసే సమయంలో పాత గోడలు, బలహీనమైన నిర్మాణాలు మరింత ప్రమాదకరంగా మారుతాయని నెటిజన్లు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి నిర్మాణాలను అధికారులు ముందుగానే గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రమాదకరంగా ఉన్న గోడల చుట్టూ బారీకేడ్లు ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Loading Tweet...




















