భారత్ సొంతంగా తయారు చేస్తున్న తొలి బుల్లెట్ ట్రైన్ త్వరలో పట్టాలపై పరుగులు పెట్టేందుకు సిద్ధమవుతోంది. దేశీయంగా అభివృద్ధి చేస్తున్న ఈ రైలుకు సంబంధించిన బాడీ ఫ్రేమ్ ఇప్పటికే సిద్ధమైంది. ప్రస్తుతం దీనిని స్క్వీజ్ టెస్టుకు పంపినట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.
మంగళవారం వడోదరలో జరిగిన ‘నమో ఫర్ వికసిత్ భారత్’ కార్యక్రమంలో మంత్రి ఈ వివరాలను వెల్లడించారు. వచ్చే ఏడాది మే లేదా జూన్‌లో దేశీయ బుల్లెట్ ట్రైన్‌తో ట్రాక్‌పై పరీక్షలు ప్రారంభిస్తామని తెలిపారు. పరీక్షలు రెండు నుంచి నాలుగు నెలల పాటు కొనసాగిన అనంతరం రైలును ప్రారంభించే అవకాశం ఉందని చెప్పారు.
ఈ దేశీయ బుల్లెట్ ట్రైన్ ముంబై–అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్‌లో వినియోగానికి సంబంధించిన ప్రాజెక్టులో భాగంగా అభివృద్ధి చేస్తున్నారు. వడోదర నుంచి ముంబైకి బుల్లెట్ ట్రైన్‌లో ప్రయాణ సమయం సుమారు గంటన్నర మాత్రమే ఉండేలా ప్రణాళిక రూపొందించారు. ఇదే కారిడార్‌లో సూరత్–బిలిమోరా మధ్య తొలి ఆపరేషనల్ సెక్షన్‌ను వచ్చే ఏడాది అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మిగిలిన మార్గాన్ని కూడా దశలవారీగా అందుబాటులోకి తీసుకురావడానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.
మరోవైపు, దేశంలో సరుకు రవాణా సామర్థ్యాన్ని పెంచే డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ పనులపైనా అశ్విని వైష్ణవ్ మాట్లాడారు. గోల్డెన్ క్వాడ్రిలేటరల్ హైవే ప్రాజెక్టుతోపాటు ఫ్రైట్ కారిడార్ ఆలోచన రూపుదిద్దుకుందని తెలిపారు. 2014లో కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఈ ప్రాజెక్టులో ఒక్క కిలోమీటర్ పని కూడా పూర్తికాలేదని, నిధులు, డిజైన్, భూసేకరణ వంటి సమస్యలను పరిష్కరించి పనులను ముందుకు తీసుకెళ్లినట్లు వివరించారు. వడోదరలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ రూ.35 వేల కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. వీటిలో రైల్వే, హైవే ప్రాజెక్టులతో పాటు వెస్ట్రన్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్‌లోని కీలక విభాగాలు ఉన్నాయి.




















