ప్రపంచవ్యాప్తంగా ఆన్‌లైన్ మోసాలు, సైబర్ నేరాలు, క్రిప్టో కుంభకోణాలు పెరుగుతున్న నేపథ్యంలో మయన్మార్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సైబర్ నేరాలకు పాల్పడటంతో పాటు అమాయకులను ఇందులో ఇరికిస్తున్న వారికి మరణశిక్ష విధించేలా రూపొందించిన 'యాంటీ ఆన్‌లైన్ స్కామ్' బిల్లుకు ఆ దేశ చట్టసభ ఆమోదం తెలిపింది. ఈ చట్టం ప్రకారం సైబర్ నేరాలకు పాల్పడటమే కాదు.. ఆన్‌లైన్ మోసాల కేంద్రాల్లో పనిచేయాలని ఒత్తిడి తీసుకొచ్చినా, హింసించినా వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నారు.
ఏ నేరాలకు ఉరిశిక్ష?
మే నెలలో విడుదల చేసిన ముసాయిదా బిల్లు ప్రకారం.. ఆన్‌లైన్ మోసాలకు పాల్పడేలా వ్యక్తులను అక్రమంగా నిర్బంధించడం, చిత్రహింసలకు గురిచేయడం, బెదిరించడం లేదా బలవంతంగా స్కామ్ కేంద్రాల్లో పనిచేయించడం చేస్తే నిందితులకు పదేళ్ల జైలు శిక్ష నుంచి యావజ్జీవ కారాగార శిక్ష వరకు విధించే అవకాశం ఉంది. అదే అలాంటి చర్యల కారణంగా బాధితుడు మరణిస్తే నేరస్తులకు మరణదండన విధించే అవకాశం ఉంటుంది. అలాంటి చర్యల కారణంగా బాధితుడు మరణిస్తే నేరస్తులకు మరణదండన విధించనున్నారు. అలాగే ఆన్‌లైన్ స్కామ్ సెంటర్లను నిర్వహించే వారితో పాటు క్రిప్టో కరెన్సీ మోసాలు చేసే వారికి కూడా గరిష్టంగా యావజ్జీవ కారాగార శిక్ష విధించాలని బిల్లులో పేర్కొన్నారు.
ప్రపంచాన్ని వణికిస్తున్న స్కామ్ సెంటర్లు
గత కొన్నేళ్లుగా మయన్మార్ ఆన్‌లైన్ మోసాలకు కేంద్రంగా మారింది. ముఖ్యంగా ప్రేమ పేరుతో మోసాలు, నకిలీ పెట్టుబడి పథకాలు, క్రిప్టో పెట్టుబడుల పేరుతో మోసాలు నిర్వహించే అంతర్జాతీయ ముఠాలు మయన్మార్‌ను కేంద్రంగా చేసుకుని కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఈ స్కామ్ సెంటర్లలో పనిచేయడానికి కొందరు స్వచ్ఛందంగా వస్తున్నప్పటికీ.. అనేకమంది విదేశీయులను ఉద్యోగాల పేరుతో మోసం చేసి అక్కడకు తరలించి, నిర్బంధించి ఆన్‌లైన్ మోసాలు చేయిస్తున్నారు. ఇటీవల కూడా ఇలాంటి ఘటన ఒక్కటి వెలుగులోకి వచ్చింది.
సోషల్‌మీడియాలో ప్రకటనలు చూసి సింగపూర్‌లో ఐటీ ఉద్యోగాల కోసం వెళ్లిన తెలుగు రాష్ట్రాలకు చెందిన 100 మంది యువతను సైబర్ నేరగాళ్లు మయన్మార్‌కు తరలించారు. అనంతరం వారి పాస్‌పోర్టులు, ఇతర పత్రాలను స్వాధీనం చేసుకుని వారిని నిర్బంధించారు. ఈ విషయాన్ని బాధితులు ఫోన్‌లో తమ కుటుంబసభ్యులకు తెలియజేయడంతో వారు జూలై 17వ తేదీన కేంద్ర విదేశాంగ శాఖకు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో బాధిత యువకులను స్వదేశానికి తీసుకురావడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఘటన తాజాగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.




















