Nepal Flash Floods : హిమాలయ దేశం నేపాల్‌లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వరద ప్రవాహానికి అనేక ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. తాజాగా నువాకోట్ జిల్లాలోని త్రిశూలి బజార్‌ను వరద నీరు ముంచెత్తింది. ఊహించని రీతిలో నీటి ప్రవాహం దూసుకురావడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు.
ఎప్పటిలాగే త్రిశూలి బజార్‌లో ఉదయం జనజీవనం సందడిగా సాగుతోంది. దుకాణదారులు వ్యాపారాల్లో నిమగ్నమై ఉండగా.. పనులకు వెళ్లేవారు, పాఠశాల విద్యార్థులతో మార్కెట్ ప్రాంతం రద్దీగా కనిపించింది. ఇంతలో ఒక్కసారిగా వరద ప్రవాహం దూసుకొచ్చింది. మృత్యువు తరుముకొస్తున్నట్లుగా వరద నీరు వేగంగా మార్కెట్‌లోకి ప్రవేశించింది. దీంతో అక్కడున్న ప్రజలు ప్రాణాలను కాపాడుకునేందుకు సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. ఆభరణాలు, దుస్తులు, ఇతర వ్యాపారాలతో కళకళలాడే ప్రాంతం కళ్లముందే బురద, శిథిలాల దిబ్బగా మారింది.
వరద ప్రవాహం త్రిశూలి బజార్‌ను ముంచెత్తుతున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వరద నీటిని చూసి స్థానికులు పరుగులు తీస్తున్న దృశ్యాలు వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ ఘటన నేపాల్‌లోని వరదల తీవ్రతకు అద్దం పడుతోంది.
Loading Tweet...




















