నేపాల్,సెప్టెంబర్ 5 (జనవాణి): నేపాల్‌లో మరోసారి వరద ముప్పు పొంచి ఉంది. దార్చులా జిల్లాలోని అపీ హిమాలా గ్రామ పంచాయతీ పరిధిలోని భట్టర్ ప్రాంతంలో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో పెద్ద ఎత్తున మట్టి, రాళ్లు చౌలాని నదిలోకి జారిపడి నదీ ప్రవాహానికి తీవ్ర ఆటంకం ఏర్పడింది. కొండచరియల కారణంగా నది కొంతమేరకు అడ్డుకుపోవడంతో నీటి ప్రవాహం మందగించింది. పరిస్థితి మరింత విషమించి మట్టి, రాళ్లతో నది పూర్తిగా మూసుకుపోతే.. ఎగువ ప్రాంతాల్లో భారీగా నీరు నిలిచిపోయే అవకాశం ఉంది. ఆ తర్వాత ఒక్కసారిగా నీరు దిగువ ప్రాంతాలకు దూసుకొస్తే ఆకస్మిక వరదలు సంభవించే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో నదీ తీర ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
ముందస్తు చర్యలు
ఆకస్మిక వరదల ముప్పును దృష్టిలో పెట్టుకుని దార్చులా జిల్లా పరిపాలన యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది. ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ.. అవసరమైతే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. భద్రతా సిబ్బందిని కూడా రంగంలోకి దించారు. నదికి సమీపంలో ఉన్న ప్రజలు అనవసరంగా బయటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. నీటి మట్టం అకస్మాత్తుగా పెరగడం లేదా నదీ ప్రవాహంలో మార్పులు కనిపిస్తే వెంటనే అప్రమత్తం కావాలని సూచించారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో నదీ తీర ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు.




















