హైదరాబాద్, ఆగస్టు 8 (జనవాణి): హైడ్రాలో డ్రైవర్ ఉద్యోగాల కోసం నిర్వహిస్తున్న రిక్రూట్‌మెంట్ ప్రక్రియ వద్ద తీవ్ర గందరగోళం నెలకొంది. ఈరోజు(శనివారం), రేపు(ఆదివారం) కార్యక్రమాలు ఉంటాయని హైడ్రా ప్రకటించింది. దీంతో సరూర్‌నగర్ స్టేడియం వద్ద 150 డ్రైవర్ పోస్టుల కోసం వేలాది మంది నిరుద్యోగులు భారీగా తరలిరావడంతో తోపులాట చోటుచేసుకుంది.
హైడ్రా ఇటీవల 150 డ్రైవర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డ్రైవర్ పోస్ట్‌ల కోసం రాష్ట్రంలోని నలుమూల నుంచి వేలాది మంది నిరుద్యోగ యువత ఈరోజు తెల్లవారుజామున 4 గంటల నుంచే భారీగా సరూర్‌నగర్ స్టేడియానికి చేరుకున్నారు. పోస్టులు తక్కువగా ఉండటం, అభ్యర్థులు వేల సంఖ్యలో రావడంతో స్టేడియం మొత్తం నిరుద్యోగులతో కిక్కిరిసిపోయింది.

గంటల తరబడి క్యూలో వేచి ఉన్నప్పటికీ సరైన ఏర్పాట్లు లేకపోవడంపై అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం తాగునీటి సౌకర్యం కూడా కల్పించలేదని వారు అసహనం వ్యక్తం చేశారు. ఉద్యోగం కోసం జిల్లాలు దాటి వచ్చిన తమ పట్ల అధికారులు నిర్లక్ష్యంగా నిర్లక్ష్యంగా ప్రవర్తించారంటూ నిరుద్యోగులు వాపోతున్నారు.
అభ్యర్థుల సంఖ్య భారీగా పెరగడంతో పరిస్థితి అదుపు తప్పి తోపులాట జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అభ్యర్థులకు ప్రస్తుతం టోకెన్లు అందించి వెనక్కి పంపిస్తున్నట్లు తెలుస్తోంది. టోకెన్‌పై పేర్కొన్న సమయానికి తిరిగి వచ్చి రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో పాల్గొనాలని నిర్వాహకులు సూచిస్తున్నారు.




















