హైదరాబాద్, సెప్టెంబర్ 14 (జనవాణి): వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమవారం ఉదయం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో భక్తిశ్రద్ధలతో గణనాథుడికి పూజా కార్యక్రమాలు చేపట్టారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గణేశుడిని దర్శించుకుని రాష్ట్ర ప్రజలందరి జీవితాల్లోని విఘ్నాలు తొలగిపోవాలని ప్రార్థించారు. ప్రజలు అన్ని రంగాల్లో విజయాలు సాధించాలని, తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లేలా దీవించాలని గణనాథుడిని వేడుకున్నారు.

పూజా కార్యక్రమం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి పండుగను ఆనందంగా, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఆకాంక్షించారు.





















