స్వాతంత్ర్యం అంటే స్వేచ్ఛ మాత్రమే కాదు.. ప్రతి భారతీయుడి కలను సాకారం చేసే అవకాశం: రాష్ట్రపతి ముర్ము

80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జాతినుద్దేశించి ప్రసంగించారు. సమాన అవకాశాలు, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్యం, సాంకేతిక ప్రగతితో అభివృద్ధి చెందిన భారత్‌ నిర్మాణానికి ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు.

15 ఆగస్టు, 2026 7:53 AM•ByRalin

Share this article

స్వాతంత్ర్యం అంటే స్వేచ్ఛ మాత్రమే కాదు.. ప్రతి భారతీయుడి కలను సాకారం చేసే అవకాశం: రాష్ట్రపతి ముర్ము

న్యూఢిల్లీ, ఆగస్టు 15 (జనవాణి): స్వాతంత్ర్యం అంటే పరాయి పాలన నుంచి విముక్తి పొందడం మాత్రమే కాదని.. ప్రతి పౌరుడికి తన సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకునే సమాన అవకాశాలు కల్పించడమే నిజమైన స్వేచ్ఛ అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గురువారం రాత్రి జాతినుద్దేశించి ఆమె ప్రసంగించారు. దేశ అభివృద్ధి ప్రయాణం, ప్రజాస్వామ్య విలువలు, సామాజిక న్యాయం, సాంకేతిక ప్రగతి, సాంస్కృతిక వారసత్వం, భవిష్యత్‌ భారత్‌ లక్ష్యాలపై రాష్ట్రపతి కీలక సందేశాన్ని ఇచ్చారు. దేశ, విదేశాల్లోని భారతీయులందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ప్రతి భారతీయుడూ దేశ నిర్మాణ భాగస్వామే

1947 ఆగస్టు 15న భారత్‌ పరాయి పాలన సంకెళ్లను తెంచుకుని స్వాతంత్ర్యం సాధించిందని రాష్ట్రపతి గుర్తుచేశారు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి దేశ నిర్మాణంలో ప్రతి పౌరుడూ భాగస్వామిగా మారారని పేర్కొన్నారు.

విద్యార్థులు, ఉపాధ్యాయులు, శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు, రైతులు, కార్మికులు, వివిధ రంగాల నిపుణులు తమ శ్రమతో దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రశంసించారు. రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక విధులను పాటించే ప్రతి పౌరుడూ దేశ నిర్మాణంలో భాగస్వామేనని స్పష్టం చేశారు.

అభివృద్ధితోపాటు వారసత్వాన్ని కాపాడాలి

భారత్‌ తన గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని, స్వాతంత్ర్య సమరయోధుల ఆదర్శాలను గౌరవిస్తూ ఆధునిక అభివృద్ధి బాటలో ముందుకు సాగుతున్నదని ముర్ము అన్నారు.

‘వయం రాష్ట్రే జాగృయాం’ అనే వేద వాక్యం దేశం పట్ల ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలనే స్ఫూర్తిని ఇస్తుందని పేర్కొన్నారు. మహాత్మా గాంధీ నాయకత్వంలో లక్షలాది మంది స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారని గుర్తుచేసిన రాష్ట్రపతి.. సామాజిక సంస్కరణలు, దేశభక్తికి డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ అందించిన గొప్ప సేవలను ప్రస్తావించారు. స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయులందరికీ ఘన నివాళులర్పించారు.

విభజన గాయాలను మర్చిపోవద్దు

ఆగస్టు 14ను ‘విభజన విషాద స్మృతి దినం’గా పాటిస్తున్న విషయాన్ని రాష్ట్రపతి ప్రస్తావించారు. మత హింస కారణంగా లక్షలాది మంది ప్రజలు శరణార్థులుగా మారి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తుచేశారు.

అయినప్పటికీ వారు తమ గుర్తింపును కోల్పోలేదన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో దేశ విభజనతో ఎదురైన తీవ్ర పరిణామాలతోపాటు.. 550కుపైగా సంస్థానాలను భారతదేశంలో విలీనం చేయడం కూడా అత్యంత క్లిష్టమైన సవాలుగా నిలిచిందని చెప్పారు. సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ నాయకత్వంలో సంస్థానాలను ప్రజాస్వామ్య భారతదేశంలో విలీనం చేసిన తీరును గుర్తుచేశారు.

‘ఆపరేషన్‌ సిందూర్‌’తో సైనిక సత్తా

‘ఆపరేషన్‌ సిందూర్‌’ భారత సాయుధ దళాల సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిందని రాష్ట్రపతి అన్నారు. ఉగ్రవాద నెట్‌వర్క్‌లపై కచ్చితమైన దాడులు నిర్వహించగల సత్తా భారత సైన్యానికి ఉందని ఈ ఆపరేషన్‌ నిరూపించిందని పేర్కొన్నారు.

ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశంతో సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం జాతీయ ప్రయోజనాలకు, ముఖ్యంగా రైతుల ప్రయోజనాలకు సంబంధించిన నిర్ణయమని అన్నారు. ఉగ్రవాదులు, వారికి సహకరించేవారు ఎక్కడ దాక్కున్నా పరిణామాలను ఎదుర్కోవాల్సిందేనని హెచ్చరించారు.

దేశం ‘నక్సల్‌ రహిత’ స్థితిని సాధించడం కూడా కీలక విజయమని రాష్ట్రపతి పేర్కొన్నారు. బస్తర్‌లో వేగంగా జరుగుతున్న అభివృద్ధి, సాంస్కృతిక సమైక్యతను ప్రస్తావించారు.

ప్రపంచ సగటు కంటే రెండింతల వృద్ధి

ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నప్పటికీ భారత ఆర్థిక వృద్ధి రేటు ప్రపంచ సగటు కంటే రెండింతలకు పైగా ఉండే అవకాశం ఉందని రాష్ట్రపతి అన్నారు. గత దశాబ్ద కాలంలో దేశం వేగవంతమైన, సమ్మిళిత అభివృద్ధి సాధించిందని పేర్కొన్నారు.

దేశ పురోగతికి అడ్డుగా ఉన్న అనేక దీర్ఘకాలిక అవరోధాలను అధిగమించామని.. వారసత్వాన్ని కాపాడుకుంటూనే అభివృద్ధి దిశగా భారత్‌ ముందుకు సాగుతున్నదని తెలిపారు.

25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు..

దేశం ప్రస్తుతం మహాత్మా జ్యోతిరావు ఫూలే 200వ జయంతి వేడుకలను నిర్వహించుకుంటున్న విషయాన్ని రాష్ట్రపతి ప్రస్తావించారు. జ్యోతిరావు ఫూలే, సావిత్రీబాయి ఫూలే సామాజిక న్యాయం, విద్య, మహిళా సాధికారత, సమానత్వం కోసం చేసిన కృషిని కొనియాడారు.

వారి ఆశయాలకు అనుగుణంగా గత కొన్నేళ్లుగా అణగారిన వర్గాల అభ్యున్నతికి జాతీయ స్థాయిలో ప్రాధాన్యం ఇచ్చామని చెప్పారు. 25 కోట్ల మందికి పైగా ప్రజలను పేదరికం నుంచి బయటకు తీసుకురాగలిగామని పేర్కొన్నారు.

59 కోట్ల మందికి బ్యాంకింగ్‌ సేవలు

ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక సమ్మిళిత పథకంగా గుర్తింపు పొందిన ప్రధాన్‌ మంత్రి జన్‌ధన్‌ యోజన ద్వారా సుమారు 59 కోట్ల మందిని బ్యాంకింగ్‌ వ్యవస్థతో అనుసంధానించినట్లు రాష్ట్రపతి తెలిపారు. వీరిలో 32 కోట్ల మందికి పైగా మహిళలేనని పేర్కొన్నారు.

లక్షలాది పేదలకు ఉచిత రేషన్‌ అందిస్తూ ఆహార భద్రత కల్పిస్తున్నామని తెలిపారు. పేదలు, బలహీన వర్గాలకు సామాజిక భద్రత, ఆర్థిక అవకాశాలు కల్పిస్తూ సమ్మిళిత అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు.

డిజిటల్‌ ఇండియాపై ప్రశంసలు

భారత్‌ ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యుత్తమ డిజిటల్‌ మౌలిక వసతుల్లో ఒకదాన్ని అభివృద్ధి చేసిందని ముర్ము అన్నారు. గ్రామాల్లోని చిన్న దుకాణాల నుంచి వీధి వ్యాపారుల వరకు డిజిటల్‌ చెల్లింపులు విస్తరించాయని పేర్కొన్నారు.

ప్రపంచవ్యాప్తంగా జరిగే రియల్‌టైమ్‌ డిజిటల్‌ లావాదేవీల్లో సగానికి పైగా భారత్‌లోనే జరుగుతున్నాయని తెలిపారు. ప్రజా సంక్షేమ సేవలను మరింత పారదర్శకంగా, సులభంగా ప్రజలకు చేరువ చేసేందుకు ప్రభుత్వం సాంకేతికతను సమర్థంగా వినియోగిస్తోందని అన్నారు.

ప్రజల ఆకాంక్షలే ప్రజాస్వామ్యానికి దిశానిర్దేశం

భారత్‌లో ప్రజల భాగస్వామ్య స్ఫూర్తి ఎంతో కాలంగా కొనసాగుతోందని రాష్ట్రపతి అన్నారు. అత్యంత పేద, సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన వారు వివిధ రంగాల్లో అసాధారణ విజయాలు సాధిస్తున్నారని పేర్కొన్నారు. ప్రతి భారతీయుడూ పెద్ద కలలు కనగలడు.. వాటిని సాకారం చేసుకోగలడు అనే నమ్మకాన్ని ఇది మరింత బలపరుస్తోందన్నారు.

ప్రజా ప్రతినిధులు ప్రజల ఆకాంక్షలను శాసనసభలు, పార్లమెంట్‌లో ప్రతిబింబించాల్సిన బాధ్యత ఉందన్నారు. ప్రజా, జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా విధానాలను అమలు చేయడం కార్యనిర్వాహక వ్యవస్థ బాధ్యత అని చెప్పారు. పేదరికం కారణంగా ఎవరికీ న్యాయం నిరాకరించబడకుండా చూడటం న్యాయ వ్యవస్థలోని ప్రతి ఒక్కరి కర్తవ్యమని స్పష్టం చేశారు.

‘వికసిత్‌ భారత్‌’ కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి

స్వాతంత్ర్యానికి నిజమైన అర్థం పరాయి పాలన నుంచి విముక్తి మాత్రమే కాదని.. ప్రతి పౌరుడికి తన కలలను సాకారం చేసుకునే అవకాశాలు లభించడమేనని రాష్ట్రపతి మరోసారి స్పష్టం చేశారు.

సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, ప్రజాస్వామ్య భాగస్వామ్యం, సాంకేతిక ప్రగతి, సాంస్కృతిక వారసత్వ పరిరక్షణతో కూడిన అభివృద్ధి చెందిన భారత్‌ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.

స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ.. రాజ్యాంగ విలువలను గౌరవిస్తూ.. దేశ ప్రగతి కోసం అంకితభావంతో పనిచేయాలని రాష్ట్రపతి ఆకాంక్షించారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలిపారు.

Ralin

Written By

Ralin

Reporter

Ralin is an experienced journalist with over 12 years of experience in journalism and digital media. Ralin has worked with leading Telugu media organizations, including Eenadu, Andhra Jyothi, and Namasthe Telangana, and specializes in news writing, digital journalism, SEO content, editing, and feature writing.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు