ఖైరతాబాద్ ఉపఎన్నిక ఇప్పట్లో లేనట్లే.. ఈసీ కీలక ప్రకటన

ఖైరతాబాద్ అసెంబ్లీ ఉపఎన్నికపై కీలక పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ నేత పి. విజయారెడ్డి దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు తుది తీర్పు వెలువడే వరకు ఉపఎన్నిక నోటిఫికేషన్ జారీ చేయబోమని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. దీంతో ఖైరతాబాద్ బైఎలక్షన్‌పై కొనసాగుతున్న ఉత్కంఠ మరింత పెరిగింది.

1 అక్టోబర్, 2026 9:33 PM•ByNarender Kumar Nangunoori

Share this article

ఖైరతాబాద్ ఉపఎన్నిక ఇప్పట్లో లేనట్లే.. ఈసీ కీలక ప్రకటన

హైదరాబాద్, అక్టోబర్ 1 (జనవాణి): ఖైరతాబాద్ అసెంబ్లీ ఉపఎన్నికకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ నేత, దివంగత పీజేఆర్ కుమార్తె పి. విజయారెడ్డి దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్‌పై తుది తీర్పు వచ్చే వరకు ఉపఎన్నిక నోటిఫికేషన్ జారీ చేయబోమని కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ హైకోర్టుకు తెలిపింది. దీంతో ప్రస్తుతం ఉపఎన్నిక ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లైంది.

2023 ఎన్నికల్లో ఏం జరిగింది?

2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన దానం నాగేందర్ విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన పి. విజయారెడ్డి రెండో స్థానంలో నిలిచారు. అయితే దానం నాగేందర్ ఎన్నికను సవాల్ చేస్తూ విజయారెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల అఫిడవిట్‌లోని ఫారం-26లో అవసరమైన వివరాలను పూర్తిగా వెల్లడించలేదని ఆమె తన పిటిషన్‌లో ఆరోపించారు. ఈ ఎన్నికల పిటిషన్ ప్రస్తుతం హైకోర్టులో పెండింగ్‌లో ఉంది.

ఉపఎన్నికకు ఎందుకు బ్రేక్?

దానం నాగేందర్ అనర్హతకు గురికావడంతో ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది. దీంతో అక్కడ ఉపఎన్నిక నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. నోటిఫికేషన్ కోసం రాజకీయ పార్టీలు, ఆశావహులు ఎదురుచూస్తున్న సమయంలో విజయారెడ్డి మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. తన ఎన్నికల పిటిషన్‌పై తుది నిర్ణయం వెలువడే వరకు ఖైరతాబాద్ ఉపఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేయకుండా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని ఆమె కోరారు. అత్యవసర విచారణ కోసం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసినప్పటికీ కోర్టు దానిని తిరస్కరించింది.

ఈసీ కీలక ప్రకటన

ఈ పరిణామాల నేపథ్యంలో విజయారెడ్డి పిటిషన్‌పై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం కీలక విషయాన్ని హైకోర్టుకు వెల్లడించింది. విజయారెడ్డి దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్‌పై తుది తీర్పు వచ్చే వరకు ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక నోటిఫికేషన్ జారీ చేయబోమని స్పష్టం చేసింది. దీంతో ముందుగా పెండింగ్‌లో ఉన్న ఎన్నికల పిటిషన్‌పై హైకోర్టు తీర్పు వెలువడాల్సి ఉంది. ఆ తీర్పు అనంతరం ఖైరతాబాద్ ఉపఎన్నికపై తదుపరి ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇక హైకోర్టు తుది తీర్పు ఎలా ఉండబోతుందనే దానిపైనే ఖైరతాబాద్ ఉపఎన్నిక భవిష్యత్తు ఆధారపడి ఉంది. కోర్టు తీర్పు తర్వాతే ఉపఎన్నిక నిర్వహణకు సంబంధించి స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు