సంగారెడ్డి, ఆగస్టు 7: జోగిపేట ఏరియా ఆసుపత్రిలో డ్యూటీ వైద్యుడి స్థానంలో నకిలీ వ్యక్తి వైద్యుడిగా విధులు నిర్వహించిన ఘటనపై రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటన ప్రభుత్వ వైద్య వ్యవస్థ ప్రతిష్ఠను దెబ్బతీసేదిగా ఉందని పేర్కొంటూ జిల్లా వైద్య ఆరోగ్య సేవల సమన్వయ అధికారి (డీసీహెచ్‌ఎస్), ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను వివరణ కోరారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ఠ పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో మంత్రి ఆరోగ్యం, విద్య, సాగునీరు, తాగునీరు, వ్యవసాయం, రెవెన్యూ, మహిళా, శిశు సంక్షేమ శాఖల పనితీరును సమీక్షించారు. ఆరోగ్యశాఖ సమీక్షలో కంకోల్, సింగీతం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ప్రారంభోత్సవ ఏర్పాట్లపై చర్చించారు. బర్దిపూర్, సుల్తాన్‌పూర్, నేరడిగుంట పీహెచ్‌సీల భవన నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలో డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి సీజనల్ వ్యాధుల పరిస్థితిపై వివరాలు తెలుసుకుని, అవసరమైన మందులు, వైద్య పరికరాలు, మౌలిక వసతులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
సంగారెడ్డి నర్సింగ్ కళాశాల, పటాన్‌చెరు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, జహీరాబాద్ మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్‌ను త్వరలో ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. సంగారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, మెడికల్ కళాశాలలో అవసరమైన మందుల కొరత లేకుండా సీఎంఎస్ కేంద్రాలను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.
విద్యాశాఖ సమీక్షలో జిల్లాలో సుమారు 1.30 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నట్లు అధికారులు వివరించారు. కేజీబీవీలు, మోడల్ స్కూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని, పాఠశాలలు, పీహెచ్‌సీలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో తాగునీరు, డ్రైనేజీ, మరుగుదొడ్ల ఏర్పాటును ప్రాధాన్యంగా తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. సంక్షేమ హాస్టళ్ల పనితీరు, భవన నిర్మాణాల పురోగతిని సమీక్షించిన మంత్రి, అద్దె భవనాల్లో కొనసాగుతున్న హాస్టళ్ల వివరాలను తెలుసుకుని వాటి పరిస్థితిని మెరుగుపర్చాలని సూచించారు.
ఈ నెల 15న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంగారెడ్డి జిల్లా పర్యటన సందర్భంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి అధికారులు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. జిల్లాలో తాగునీటి సరఫరాపైనా మంత్రి సమీక్ష నిర్వహించారు. మంజీర, సింగూరు ప్రాజెక్టుల నీటి నిల్వలు, ఇంటెక్ వెల్‌ల ద్వారా సరఫరా పరిస్థితిని తెలుసుకుని, రానున్న రోజుల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.





















