Commonwealth Games | కామన్‌వెల్త్ గేమ్స్ 2026లో భారత బాక్సర్లు సత్తా చాటారు. శనివారం జరిగిన ఫైనల్స్‌లో ప్రీతి పవార్, జైస్మిన్ లంబోరియా పసిడి పతకాలు సాధించగా.. జాదుమణి సింగ్ రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. దీంతో బాక్సింగ్‌లో భారత ఖాతాలో తొలి సెషన్‌లోనే రెండో గోల్డ్, ఒక సిల్వర్ మెడల్ చేరాయి.
తొలుత మహిళల 54 కేజీల విభాగంలో ప్రీతి పవార్ కెనాడకు చెందిన స్కార్లెట్ సవానా డెల్గాడోపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. ప్రత్యర్థిపై పంచ్‌లతో విరుచుకుపడి 5-0 తేడాతో ఏకగ్రీవంగా విజయాన్ని అందుకుంది. 23 ఏళ్ల ప్రీతి ఇప్పటికే ఆసియా క్రీడల్లో కాంస్య పతక విజేతగా నిలిచింది. అలాగే 2025 వరల్డ్ బాక్సింగ్ కప్‌లో గోల్డ్ మెడల్ సాధించింది. అలాగే ఈ ఏడాది జరిగిన ఆసియా ఎలైట్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో మూడుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన హువాంగ్ షియావో వెన్‌ను ఓడించింది. ఇలా వరుస విజయాలతో ఫామ్‌లో ఉన్న ప్రీతి.. కామన్‌వెల్త్ ఫైనల్‌లో అలవోకగా పోరాడి పసిడి పతకాన్ని సాధించింది.
అనంతరం జరిగిన మహిళల 57 కేజీల ఫైనల్‌లో జైస్మిన్ లంబోరియా నార్తర్న్ ఐర్లాండ్‌కు చెందిన డిఫెండింగ్ ఛాంపియన్ మైకేలా వాల్స్‌పై 5-0తో అద్భుత విజయం సాధించి పసిడి పతకాన్ని అందుకుంది. 2022 కామన్‌వెల్త్ గేమ్స్‌లో జైస్మిన్ కాంస్య పతకం గెలిచింది. ఆ తర్వాత పారిస్ ఒలింపిక్స్‌లో తగిలిన ఎదురుదెబ్బతో తన ఆట తీరును మార్చుకున్న ఆమె ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. తాజాగా కామన్‌వెల్త్‌లో గోల్డ్ మెడల్‌ను గెలుచుకుంది.
మరోవైపు పురుషుల బాక్సింగ్ 55 కేజీల విభాగంలో జాదుమణి సింగ్ సిల్వర్ మెడల్ దక్కించుకున్నాడు. మణిపూర్‌కు చెందిన 21 ఏళ్ల జాదుమణి ఇప్పటికే జాతీయ ఛాంపియన్‌గా నిలిచాడు. మాజీ ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత అమిత్ పంఘాల్‌ను ఓడించి కామన్‌వెల్త్ గేమ్స్‌కు అర్హత సాధించాడు. గతంలో వరల్డ్ బాక్సింగ్ కప్‌లో రజత పతకం గెలిచిన అతను.. ఈసారి కామన్‌వెల్త్ గేమ్స్‌లోనూ వెండి పతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.





















