జీవితం ఆమెకు ఒక్క అవకాశమూ ఇవ్వలేదు.. అయినా కుంగిపోకుండా ఆమె జీవితాన్నే అవకాశంగా మార్చుకుంది. రెండేళ్లకే పోలియోతో మొదలైన పోరాటం, బాల్య వివాహం, భర్త చిత్రహింసలు, ఇంట్లో నుంచి గెంటేస్తే ఇద్దరు పిల్లల బాధ్యత, ఆర్థిక కష్టాలు.. ఇవన్నింటినీ దాటుకుని కామన్‌వెల్త్ వేదికపై విజేతగా నిలిచింది. పట్టుదల ఉంటే విధిని మార్చుకోవచ్చని నిరూపించింది. ఆమే హర్యానాకు చెందిన షర్మిల ధన్‌కర్. ఆమె జీవితం.. కష్టాల్లో కూరుకుపోయిన ప్రతి ఒక్కరికీ ఓ స్ఫూర్తి, ఓ ఆశాకిరణం.
హర్యానాలోని మహేంద్రగఢ్ జిల్లా చిత్రౌలికి చెందిన షర్మిల ధన్‌కర్ తండ్రి ఓ సన్నకారు రైతు. ఆమె తల్లికి దృష్టి లోపం. నలుగురు సంతానంలో షర్మిల రెండో బిడ్డ. ఆర్థిక ఇబ్బందులకు తోడు సరైన వైద్య సదుపాయాలు లేకపోవడంతో షర్మిల రెండేళ్ల వయసులోనే పోలియో బారినపడింది. దీంతో ఆమె ఎడమకాలు పూర్తిగా దెబ్బతింది. ఇతర పిల్లల్లా పరుగులు తీయడం, ఆడుకోవడం ఆమెకు సాధ్యం కాలేదు. చిన్నతనం నుంచే శారీరక వైకల్యంతో జీవించడం ఎంత కష్టమో అనుభవించింది. ఇన్ని ఇబ్బందుల్లోనే పదో తరగతి పూర్తి చేసింది. కానీ ఆ వెంటనే షర్మిలకు పెళ్లి చేసేశారు.
బాల్య వివాహం.. నరకంగా మారిన దాంపత్యం
పదో తరగతి పూర్తికాగానే షర్మిలకు తల్లిదండ్రులు బాల్య వివాహం చేశారు. పెళ్లి తర్వాత అయినా తన జీవితం మారుతుందని షర్మిల ఆశపడితే, దానికి రివర్స్‌లో మరింత దిగజారింది. అప్పటిదాకా శారీరక సమస్యలు మాత్రమే ఉండగా.. పెళ్లయ్యాక మానసిక సమస్యలు పెరిగిపోయాయి. తాగుడుకు అలవాటు పడిన భర్త ఏ పనిచేయకుండా షర్మిలను నిత్యం వేధించేవాడు. దీంతో కుటుంబ భారం మొత్తం ఆమెనే మోయాల్సి వచ్చింది. అయినప్పటికీ కట్నం తీసుకురాలేదని ఆమె భర్త చిదకబాదేవాడు. ఏళ్లతరబడి భర్త నుంచి గృహహింస, వేధింపులు ఉండేవి. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత భర్త టార్చర్ మరింత ఎక్కువైంది. ఇద్దరు ఆడపిల్లలే పుట్టారని చావబాదేవాడు. ఈ క్రమంలోనే ఒకసారి షర్మిలను భర్త కొట్టి, దుస్తులు చింపేసి ఇరుగుపొరుగు వారి ముందు నెలబెట్టాడు. ఆ సంఘటన తర్వాత ఇద్దరు పిల్లలతో సహా షర్మిలను ఇంటి నుంచి గెంటేశాడు. దీంతో పుట్టింటికి చేరుకున్న షర్మిల.. ఏ పని దొరికితే అది చేసుకుంటూ తన పిల్లలను పోషించుకునేది. ఆ సమయంలో జీవితం పూర్తిగా చీకట్లోకి వెళ్లిపోయిందని షర్మిల పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు.
రెండో పెళ్లితో మారిన జీవితం
28 ఏళ్ల వయసులో షర్మిలకు అజిత్ సింగ్‌తో రెండో వివాహం జరిగింది. అదే ఆమె జీవితంలో అతిపెద్ద మలుపు. షర్మిలలోని ఆత్మవిశ్వాసాన్ని గుర్తించిన అజిత్ సింగ్ ప్రోత్సహించాడు. క్రీడల్లో రాణించగలవని ఆమెలోని టాలెంట్‌ను గుర్తుచేశాడు. షర్మిలను రెవాడీకి తీసుకెళ్లి అక్కడ పారా స్పోర్ట్స్‌లో చేర్పించాడు. అక్కడే ఆమె షాట్‌పుట్‌లో ప్రావీణ్యం మొదలుపెట్టింది. అయితే ఇది మొదట షర్మిలకు అసాధ్యంగా అనిపించింది. "నేను ఎప్పుడూ ఆటలు ఆడలేదు. నాకు వైకల్యం ఉంది. 34 ఏళ్ల వయసులో కెరీర్ ప్రారంభించడం అంటే అందరూ నవ్వుతారని అనిపించింది. కానీ నా భర్త మాత్రం ప్రయత్నించమని నాలో భరోసా నింపాడు" అని గతంలో ఓ ఇంటర్వ్యూలో షర్మిల వెల్లడించింది.
34 ఏళ్ల వయసులో కొత్త జీవితం.. ఆటలు మొదలుపెట్టిన తొలి ఏడాదే ఛాంపియన్!
2020వ సంవత్సరంలో కోచ్ టేక్‌చంద్ వద్ద షర్మిల శిక్షణ ప్రారంభించింది. షాట్‌పుట్ ఎఫ్-57 విభాగంలో సాధన కొనసాగించింది. రోజుకు గంటల తరబడి సాధన, ఫిట్‌నెస్ వ్యాయామాలు, ఆహార నియమాలు పాటిస్తూ తన శరీరాన్ని పోటీలకు సిద్ధం చేసుకుంది. క్రీడల్లో అడుగుపెట్టిన తొలి ఏడాదిలోనే జాతీయ స్థాయిలో ఛాంపియన్‌గా నిలిచింది. అప్పటి నుంచి ఆమె వెనుదిరిగి చూసుకోలేదు. జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతూ భారత పారా అథ్లెటిక్స్‌లో కీలక అథ్లెట్‌గా గుర్తింపు తెచ్చుకుంది.
నాలుగో స్థానం నుంచి కాంస్య పతకం వరకు
2022 బర్మింగ్‌హామ్ కామన్‌వెల్త్ క్రీడల్లో షర్మిల జాతీయ రికార్డు నెలకొల్పినా పతకం మాత్రం చేజారింది. కేవలం నాలుగో స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆసియా పారా గేమ్స్, ప్రపంచ పారా అథ్లెటిక్ష్ ఛాంపియన్‌షిప్‌ల్లోనూ ఆశించిన ఫలితాలు రాలేదు. కానీ ఈసారి గ్లాస్గోలో ఆ అవకాశాన్ని వదులుకోలేదు. మహిళల ఎఫ్-57 షాట్‌పుట్ విభాగంలో 9.81 మీటర్ల సీజన్ బెస్ట్ త్రో తో బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. ఆమె వేసిన ఆరు త్రోలు 9 మీటర్లకు పైగానే ఉండటం విశేషం.
పతకం వెనుక మరో కల!
ఈ పతకం కేవలం ఆమె విజయం మాత్రమే కాదు. తన కుటుంబం కోసం చేసిన పోరాటానికి గుర్తింపు కూడా అనే చెప్పాలి. ఎందుకంటే క్రీడల్లో కొనసాగేందుకు తన కుటుంబం ఎన్నో త్యాగాలు చేసింది. ఎంత ఆర్థిక ఇబ్బంది ఎదురైనా ఆమె భర్త అజిత్ సింగ్ ఎప్పుడూ వెన్నంటే నిలిచాడు. ఎప్పుడూ క్రీడలను ఆపేయమని చెప్పకుండా ప్రోత్సహించాడు. దీంతో తనకు ఒక ప్రభుత్వ ఉద్యోగం రావాలని.. అప్పుడే తన కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపడుతుందని.. అందుకు పతకం గెలవడం చాలా ముఖ్యం షర్మిల కామన్‌వెల్త్ క్రీడలకు వెళ్లే ముందు ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. అన్నట్లుగానే కామన్‌వెల్త్ పతకం గెలిచింది.
ఎందరికో స్ఫూర్తి
"నా కథ గృహహింసను ఎదుర్కొంటున్న మహిళలకు ధైర్యాన్ని ఇవ్వాలి. జీవితం ఎప్పుడూ ముగిసిపోదని వారు నమ్మాలి. " అని కామన్‌వెల్త్ క్రీడలకు వెళ్లే ముందు షర్మిల చెప్పిన మాటలు ఇప్పుడు నిజమయ్యాయి. ఆమె విజయం కేవలం భారతదేశానికి మరో పతకం మాత్రమే కాదు.. జీవితంలో ఎంతటి కష్టాలు వచ్చినా ఆత్మవిశ్వాసం, పట్టుదల ఉంటే అసాధ్యమేమీ లేదని నిరూపించింది.




















