బాహుబలి తరహాలో గణనాథుడిని భుజానికెత్తుకున్న సీఎం రేవంత్‌రెడ్డి.. వైరల్‌గా వినూత్న గణపతి

హైదరాబాద్‌ గోషామహల్‌ నియోజకవర్గంలోని అగాపురాలో ఏర్పాటు చేసిన వినూత్న గణపతి మండపం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ‘తెలంగాణ రైజింగ్‌–1000 డేస్‌ యాజ్‌ సీఎం’ థీమ్‌తో రూపొందించిన ఈ మండపంలో సీఎం రేవంత్‌రెడ్డి భుజంపై గణనాథుడిని ఎత్తుకున్నట్లుగా విగ్రహాన్ని తీర్చిదిద్దారు. ఈ ప్రతిమ ‘బాహుబలి’ సినిమాలోని శివలింగాన్ని భుజాన మోసే సన్నివేశాన్ని తలపిస్తోంది.

14 సెప్టెంబర్, 2026 4:36 PM•ByNarender Kumar Nangunoori

Share this article

బాహుబలి తరహాలో గణనాథుడిని భుజానికెత్తుకున్న సీఎం రేవంత్‌రెడ్డి.. వైరల్‌గా వినూత్న గణపతి

హైదరాబాద్‌, సెప్టెంబర్ 14 (జనవాణి): వినాయక చవితి సందర్భంగా గణనాథుడిని వివిధ రూపాల్లో ప్రతిష్ఠించడం ఆనవాయితీగా మారింది. ట్రెండింగ్‌ సినిమాలు, హీరోలు, సామాజిక అంశాలకు అనుగుణంగా వినాయక విగ్రహాలను రూపొందించడం ప్రతి ఏడాది ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని ఓ గణపతి మండపం వినూత్న ప్రతిమతో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.

గోషామహల్‌ నియోజకవర్గం అగాపురాలో ‘తెలంగాణ రైజింగ్‌–1000 డేస్‌ యాజ్‌ సీఎం’ థీమ్‌తో ప్రత్యేక గణపతి మండపాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ ఫిషర్‌మెన్‌ కాంగ్రెస్‌ చైర్మన్‌ మెట్టు సాయికుమార్‌ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ మండపంలో సీఎం రేవంత్‌రెడ్డి విగ్రహాన్ని ప్రత్యేకంగా రూపొందించారు.

బాహుబలి తరహాలో రేవంత్‌ విగ్రహం

‘బాహుబలి’ సినిమాలో ప్రభాస్‌ శివలింగాన్ని భుజాన మోసే సన్నివేశాన్ని పోలిన రీతిలో.. సీఎం రేవంత్‌రెడ్డి విగ్రహం భుజంపై గణనాథుడిని ఎత్తుకున్నట్లుగా ప్రతిమను తీర్చిదిద్దారు. తెల్ల చొక్కా, నల్ల ప్యాంటు, ఆకుపచ్చ కండువాతో ఉన్న రేవంత్‌ ప్రతిమ చూపరులను ఆకట్టుకుంటోంది.

సంక్షేమ పథకాలపై ప్రత్యేక ప్రదర్శన

గణపతి ప్రతిమతో పాటు కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించేలా మండపం చుట్టూ ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఉచిత వ్యవసాయ విద్యుత్‌, పంట నష్టపరిహారం వంటి రైతు సంక్షేమ కార్యక్రమాలను ప్రదర్శించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌, గృహజ్యోతి కింద ఉచిత విద్యుత్‌, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత పింఛన్లు, సన్నబియ్యం పంపిణీ, యువతకు ఉద్యోగ నియామకాలు, విద్యా భరోసా కార్డులు, రాజీవ్‌ ఆరోగ్యశ్రీ తదితర పథకాల వివరాలను ఫ్లెక్సీల ద్వారా అందుబాటులో ఉంచారు.

అభివృద్ధి కార్యక్రమాలకూ చోటు

రీజినల్‌ రింగ్‌ రోడ్డు, మూసీ నది పునరుజ్జీవన ప్రణాళిక వంటి మౌలిక వసతుల అభివృద్ధి కార్యక్రమాలను కూడా మండపంలోని ప్రదర్శనలో పొందుపరిచారు. వెయ్యి రోజుల పాలనలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఒకే వేదికపై ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

గణనాథుడి దర్శనానికి వచ్చిన భక్తులు వినూత్న ప్రతిమను ఆసక్తిగా తిలకించడంతో పాటు మండపంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల వివరాలను పరిశీలిస్తున్నారు. దీంతో అగాపురాలోని ఈ గణపతి మండపం నగరంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు