హైదరాబాద్, ఆగస్టు 14 (జనవాణి): శ్రావణమాసం తొలి శుక్రవారం సందర్భంగా శ్రీ మాతా నిమిషాంబ దేవి ఆలయం భక్తిశ్రద్ధలతో, ఆధ్యాత్మిక శోభతో కళకళలాడింది. శ్రీ హంపీ విరూపాక్ష విద్యారణ్య మహా సంస్థానం, హంపి పీఠం ఆధ్వర్యంలో అమ్మవారికి 1116 చీరలతో నిర్వహించిన విశేష అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. దివ్య దీపకాంతుల మధ్య అమ్మవారు దేదీప్యమానంగా వెలుగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. నిమిషాంబ నామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగాయి. శ్రావణ శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించడంతో ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
శ్రావణమాసం లక్ష్మీదేవి ఆరాధనకు అత్యంత విశిష్టమైనదని భక్తుల విశ్వాసం. ముఖ్యంగా శ్రావణ శుక్రవారాల్లో లక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే అష్టలక్ష్మిల అనుగ్రహం లభించి, కుటుంబంలో సుఖసంతోషాలు, సిరిసంపదలు వృద్ధి చెందుతాయని నమ్ముతారు. శ్రావణమాసంలో అమ్మవారిని మనసారా పూజించడం ద్వారా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సిరిసంపదలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు.
ఈ సందర్భంగా మధ్యాహ్నం భక్తుల కోసం అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ శ్రీ కామరౌతు వినోద్ కుమార్, సెట్లర్ కళావతి, ప్రధాన కార్యదర్శులు కె. అశోక్ కుమార్, సంగు శ్రీనివాస్, కోశాధికారి ఎన్. రమేష్, రాష్ట్ర నకాష్ సంఘం ప్రధాన కార్యదర్శి కొరిచెర్ల శ్రీనివాస్ రావు తో పాటు ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ చంద్రశేఖర్ శర్మ, అర్చకుడు శ్రీ ఉమకాంత్ శర్మ పాల్గొన్నారు.





















