Sravana Masam 2026: హిందూ సంప్రదాయ పంచాంగంలో శ్రావణ మాసానికి ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. ఆషాఢ మాసం ముగిసిన అనంతరం వచ్చే ఈ మాసాన్ని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. శ్రావణ పౌర్ణమి రోజున శ్రావణ నక్షత్రం పూర్ణచంద్రుడితో కలిసి ఉండటం వల్ల ఈ మాసానికి ‘శ్రావణ మాసం’ అనే పేరు వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం కూడా శ్రావణ నక్షత్రమే కావడంతో ఈ మాసానికి మరింత ప్రాధాన్యత ఏర్పడింది. శ్రావణ మాసంలో శ్రీ మహావిష్ణువు, మహాలక్ష్మి, పరమశివుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే విశేష పుణ్యఫలాలు లభిస్తాయని భక్తుల విశ్వాసం.
2026లో శ్రావణ మాసం ఎప్పటి నుంచి?
2026లో శ్రావణ మాసం ఆగస్టు 13, గురువారం నుంచి ప్రారంభమవుతుంది. ఈ మాసంలో నాగపంచమి, వరలక్ష్మి వ్రతం, రాఖీ పౌర్ణమి, శ్రీకృష్ణ జన్మాష్టమి వంటి పర్వదినాలు రానున్నాయి.
ముఖ్యమైన తేదీలు:
ఆగస్టు 13: శ్రావణ మాసం ప్రారంభం
ఆగస్టు 17: నాగుల పంచమి
ఆగస్టు 21: వరలక్ష్మి వ్రతం
ఆగస్టు 23: శ్రావణ పుత్రద ఏకాదశి
ఆగస్టు 28: రాఖీ పౌర్ణమి / జంధ్యాల పౌర్ణమి
సెప్టెంబరు 4: శ్రీకృష్ణ జన్మాష్టమి
సెప్టెంబరు 10-11: పొలాల అమావాస్య
శ్రావణ సోమవారాలు.. శివారాధనకు ప్రత్యేకం
శ్రావణ మాసంలోని సోమవారాలను పరమశివుడి ఆరాధనకు అత్యంత పవిత్రమైన రోజులుగా భావిస్తారు. 2026లో శ్రావణ సోమవారాలు ఆగస్టు 17, 24, 31, సెప్టెంబరు 7 తేదీల్లో వస్తాయి. ఈ రోజుల్లో ఉపవాసం ఉండి శివలింగానికి పంచామృతంతో అభిషేకం చేయడం, మారేడు దళాలు సమర్పించడం, మహా మృత్యుంజయ మంత్రాన్ని జపించడం వంటి ఆచారాలను భక్తులు పాటిస్తారు.

శ్రావణ మంగళవారాలు.. మంగళ గౌరీ వ్రతం
శ్రావణ మంగళవారాలకు కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. 2026లో ఇవి ఆగస్టు 18, 25, సెప్టెంబరు 1, 8 తేదీల్లో వస్తున్నాయి. ముఖ్యంగా కొత్తగా వివాహమైన మహిళలు మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు. భర్తకు ఆయురారోగ్యాలు, దీర్ఘ సుమంగళీ ప్రాప్తి, కుటుంబ సౌభాగ్యం కోసం గౌరీదేవిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు.

లక్ష్మీదేవి అనుగ్రహం కోసం...శ్రావణ శుక్రవారాలు..
శ్రావణ శుక్రవారాలను మహాలక్ష్మి ఆరాధనకు అత్యంత శ్రేష్ఠమైనవిగా భావిస్తారు. 2026లో శ్రావణ శుక్రవారాలు ఆగస్టు 14, 21, 28, సెప్టెంబరు 4 తేదీల్లో వస్తాయి. ముఖ్యంగా ఆగస్టు 21న వరలక్ష్మి వ్రతం జరుపుకోనున్నారు. మహిళలు లక్ష్మీదేవిని ప్రత్యేకంగా అలంకరించి, పూజలు, వ్రతాలు నిర్వహించి కుటుంబ సుఖసంతోషాలు, ఐశ్వర్యం కోసం ప్రార్థిస్తారు.

శ్రావణ మాసంలో పాటించాల్సిన నియమాలు
శ్రావణ మాసంలో భక్తులు కొన్ని పవిత్ర నియమాలను పాటించడం ఆనవాయితీగా వస్తోంది. ప్రతిరోజూ ఉదయం స్నానం అనంతరం దేవాలయ దర్శనం చేసుకోవడం. శివాలయంలో శివలింగానికి అభిషేకం చేయడం. ఇంట్లో మహాలక్ష్మిదేవికి దీపారాధన చేయడం. అష్టోత్తరం లేదా విష్ణు సహస్రనామం పారాయణం చేయడం. సాత్విక ఆహారం తీసుకోవడం. సోమవారాలు, ముఖ్యమైన పర్వదినాల్లో శక్తికి తగిన విధంగా ఉపవాసం లేదా నియమాలు పాటించడం మంచిది.
భక్తిశ్రద్ధలతో శ్రావణ మాసాన్ని ఆధ్యాత్మికంగా గడపడం ద్వారా మనసుకు ప్రశాంతత, కుటుంబానికి శుభం కలుగుతాయని భక్తుల విశ్వాసం.




















