దేశంలో మోటారు వాహనాల బీమా నిబంధనలను అమలు చేయడంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ లేకుండా రోడ్లపై తిరుగుతున్న వాహనాల సంఖ్య పెరుగుతుండటంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో 'నో ఇన్సూరెన్స్.. నో ఫ్యూయల్' విధానాన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసే అంశాన్ని పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ అంశంపై విచారణ చేపట్టింది. దేశంలో సగానికి పైగా వాహనాలు మోటారు వాహనాల చట్టానికి విరుద్ధంగా సరైన థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ లేకుండానే రోడ్లపై సంచరిస్తున్నాయని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇది రోడ్డు భద్రతతో పాటు ప్రమాద బాధితుల పరిహారంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొంది.
ఈ సమస్యకు పరిష్కారంగా 'నో ఇన్సూరెన్స్.. నో ఫ్యూయల్' విధానం సమర్థవంతంగా పనిచేయగలదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ విధానం అమల్లోకి వస్తే ఇన్సూరెన్స్ లేని వాహనాలను సులభంగా గుర్తించే అవకాశం ఉండటంతో పాటు, వాహన యజమానులకు బీమా గడువు ముగిసిందనే విషయాన్ని గుర్తు చేసే వ్యవస్థగా కూడా ఉపయోగపడుతుందని తెలిపింది.ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ముందుగా పైలట్ ప్రాజెక్టు చేపట్టాలని ధర్మాసనం సూచించింది. ముఖ్యంగా జాతీయ రహదారులు, తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాలు, టోల్ ప్లాజాల వద్ద ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేసి ఫలితాలను పరిశీలించాలని పేర్కొంది.
ఈ విధానంపై కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం దేశవ్యాప్తంగా వాహనదారులపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో ఇప్పుడు అందరి దృష్టి కేంద్రం స్పందనపైనే నిలిచింది.




















