దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమాల నిర్వహణపై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నగర నడిబొడ్డున నిరసనల పేరుతో ప్రజలకు అసౌకర్యం కలిగించడం సమంజసం కాదని అభిప్రాయపడిన న్యాయస్థానం, జంతర్ మంతర్‌ను నిరసనల వేదికగా ఎందుకు కొనసాగిస్తున్నారు? దానిని ఎందుకు మూసివేయకూడదు? అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
ఆల్ ఇండియా దళిత్ క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ అమిత్ మహాజన్ విచారణ చేపట్టారు. సుమారు 75 మందితో శాంతియుత నిరసన నిర్వహించేందుకు జూలైలో దరఖాస్తు చేసుకున్నప్పటికీ, ఢిల్లీ పోలీసులు ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది సంజోయ్ ఘోష్ కోర్టుకు వివరించారు.
దీనిపై స్పందించిన న్యాయమూర్తి, అసలు జంతర్ మంతర్‌ను ఎందుకు మూసివేయకూడదు? నా అభిప్రాయం ప్రకారం ఇటువంటి నిరసనలు నగర నడిబొడ్డున జరగకూడదు. అనవసరంగా నగరాన్ని ఎందుకు బందీగా మార్చాలి? అని వ్యాఖ్యానించారు. నిరసన ప్రదర్శనలు నగరం వెలుపల జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు.
కేంద్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన అదనపు సొలిసిటర్ జనరల్ చేతన్ శర్మ, జంతర్ మంతర్‌ను నిరసనల వేదికగా కొనసాగించే అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టు పరిశీలనలో ఉందని కోర్టుకు తెలిపారు. అలాగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల దృష్ట్యా ఆ ప్రాంతంలో సెక్షన్ 144 అమల్లో ఉందని, భారీ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ఉభయ పక్షాల వాదనలు విన్న ఢిల్లీ హైకోర్టు, పిటిషనర్ సమర్పించిన దరఖాస్తుపై ఆగస్టు 8లోగా నిర్ణయం తీసుకోవాలని ఢిల్లీ పోలీసులను ఆదేశిస్తూ పిటిషన్‌ను పరిష్కరించింది.
ఇదిలా ఉండగా జంతర్ మంతర్‌కు బదులుగా రామ్‌లీలా మైదానం వంటి ప్రత్యామ్నాయ వేదికలను పరిశీలించాలని కోరుతూ దాఖలైన మరో పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇప్పటికే కేంద్రం స్పందన కోరింది.




















