తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో పవిత్రోత్సవాలు.. నేటి సాయంత్రం అంకురార్పణ

తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో పవిత్రోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సెప్టెంబర్ 24 నుంచి 26 వరకు మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించనుండగా, బుధవారం సాయంత్రం అంకురార్పణ కార్యక్రమాలను శాస్త్రోక్తంగా చేపట్టనున్నారు. పవిత్రోత్సవాల నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం పలు ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది.

23 సెప్టెంబర్, 2026 5:17 PM•ByNarender Kumar Nangunoori

Share this article

తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో పవిత్రోత్సవాలు.. నేటి సాయంత్రం అంకురార్పణ

తిరుపతి,సెప్టెంబర్ 23 (జనవాణి): తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో పవిత్రోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సెప్టెంబర్ 24 నుంచి 26వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలను వైదిక సంప్రదాయాల ప్రకారం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా సెప్టెంబర్ 23న సాయంత్రం 5.30 నుంచి 7.30 గంటల వరకు విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణ కార్యక్రమాలను నిర్వహించనున్నారు.

ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

పవిత్రోత్సవాలకు ముందు ఆలయ పవిత్రతను పరిరక్షించేందుకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం మంగళవారం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం శ్రీ పద్మావతి అమ్మవారిని సుప్రభాతంతో మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహించిన అనంతరం ఉదయం 6 నుంచి 8.30 గంటల వరకు తిరుమంజనం చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పులు, పూజా సామగ్రి తదితరాలను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం, కుంకుమ తదితర సుగంధ ద్రవ్యాలతో సిద్ధం చేసిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం ఉదయం 9 గంటల నుంచి భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతించారు.

పవిత్రోత్సవాల ఉద్దేశం ఇదే..

వైదిక సంప్రదాయం ప్రకారం జాతాశౌచం, మృతాశౌచం వంటి కారణాలతో ఆలయ పవిత్రతకు తెలియకుండానే లోపాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇలాంటి దోషాలకు శాస్త్రోక్త పరిహారంగా ఆలయ పవిత్రతను పునరుద్ధరించేందుకు ప్రతి ఏడాది మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

మూడు రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు

పవిత్రోత్సవాల్లో భాగంగా.. సెప్టెంబర్ 24: పవిత్ర ప్రతిష్ఠ, సెప్టెంబర్ 25: పవిత్ర సమర్పణ, సెప్టెంబర్ 26: పూర్ణాహుతి కార్యక్రమాలను నిర్వహించనున్నారు. పవిత్రోత్సవాల ఆర్జిత సేవలో ఒక గృహస్తుడు రూ.750 చెల్లించి మూడు రోజుల పాటు పాల్గొనే అవకాశం ఉంది. సేవలో పాల్గొనే గృహస్తులకు రెండు లడ్డూలు, రెండు వడలు బహుమానంగా అందజేస్తారు.

పలు ఆర్జిత సేవలు రద్దు

పవిత్రోత్సవాల నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం టీటీడీ పలు ఆర్జిత సేవలను రద్దు చేసింది. సెప్టెంబర్ 23 నుంచి 26 వరకు కల్యాణోత్సవం, ఊంజలసేవ, సెప్టెంబర్ 24 నుంచి 26 వరకు వేదాశీర్వచనం రద్దు చేశారు. అలాగే సెప్టెంబర్ 25, 26 తేదీల్లో బ్రేక్ దర్శనం, కుంకుమార్చన, లక్ష్మీపూజ సేవలను నిలిపివేశారు. సెప్టెంబర్ 24న తిరుప్పావడ సేవ, సెప్టెంబర్ 25న అభిషేకానంతర దర్శనం, సెప్టెంబర్ 26న సామవేద పుష్పాంజలి సేవలను కూడా టీటీడీ రద్దు చేసింది. ఈ కార్యక్రమాల్లో ఆలయ డెప్యూటీ ఈవో హరీంద్రనాథ్, అర్చకులు బాబు స్వామి, ఏఈవో దేవరాజులు, సూపరింటెండెంట్ మునిచెంగల్రాయలు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ చలపతి తదితర అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు