Mahalaya Paksha 2026 | మహాలయ పక్షం.. పితృదేవతారాధనకు విశిష్ట సమయం

Mahalayam | ఏడాదిలో వచ్చే పన్నెండు అమావాస్యల్లో మహాలయ అమావాస్యకు ప్రత్యేక ప్రాధాన్యం ఉందని పురాణాలు, ధర్మశాస్త్రాలు పేర్కొంటున్నాయి. భాద్రపద బహుళ పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఉండే పదిహేను రోజుల కాలాన్ని మహాలయ పక్షంగా వ్యవహరిస్తారు.

26 సెప్టెంబర్, 2026 6:10 AM•ByPradeep

Share this article

Mahalaya Paksha 2026 | మహాలయ పక్షం.. పితృదేవతారాధనకు విశిష్ట సమయం

Mahalaya Paksha 2026 | మహాలయ పక్షం.. పితృదేవతారాధనకు విశిష్ట సమయం

Mahalayam | ఏడాదిలో వచ్చే పన్నెండు అమావాస్యల్లో మహాలయ అమావాస్యకు ప్రత్యేక ప్రాధాన్యం ఉందని పురాణాలు, ధర్మశాస్త్రాలు పేర్కొంటున్నాయి. భాద్రపద బహుళ పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఉండే పదిహేను రోజుల కాలాన్ని మహాలయ పక్షంగా వ్యవహరిస్తారు. ఈ కాలమంతా పితృదేవతల ఆరాధనకు విశిష్టమైనదిగా భావిస్తారు. ఈ నెల 27 నుంచి మహాలయ పక్షం ప్రారంభం కానుంది. మహాలయ పక్షంలో ఇంటివద్దగానీ, నదీతీరాల్లోగానీ పితృకర్మలు నిర్వహించవచ్చు. మహాలయ అమావాస్య రోజైన అక్టోబర్‌ 10న పితృదేవతలకు శ్రాద్ధవిధులు నిర్వహించుకోవచ్చని పండితులు చెబుతున్నారు.

పితృదేవతల ఆరాధనకు ప్రాధాన్యం

‘మహాలయం’ అంటే గొప్పదైన లయం అని అర్థం. దైవగణాలకు దక్షిణాయనం రాత్రికాలంగా పేర్కొంటారు. ఈ సమయంలో పితృగణాలు తమ శక్తులను ఏకీకృతం చేసుకుని, కర్మాధికారం కలిగిన మానవుల వైపు చూస్తుంటాయని పురాణాలు పేర్కొంటున్నాయి. మనుస్మృతి ప్రకారం ఆషాఢ మాస కృష్ణపక్షం నుంచి భాద్రపద కృష్ణపక్షం వరకు పితరులు అన్నాదులను ఆశిస్తారని చెబుతారు. ఇదే విషయాన్ని స్కాందపురాణంలోని నాగరఖండం కూడా ప్రస్తావించినట్లు పండితులు వివరిస్తున్నారు. సూర్యుడు కన్యారాశిలో ప్రవేశించినప్పటి నుంచి పితృదేవతలకు శ్రాద్ధం చేయాలని మహాభారతం నిర్దేశించినట్లు పేర్కొంటారు. హేమాద్రి పండితుడు రచించిన ‘చతుర్వర్గ చింతామణి’ ప్రకారం సూర్యుడు కన్యారాశిలో సంచరించే కాలంలో పితృయజ్ఞం చేయడం విశేష ఫలప్రదమని చెబుతారు. ఈ కాలంలో శ్రాద్ధకర్మలు నిర్వహించడం ద్వారా గయాశ్రాద్ధం చేసిన ఫలం లభిస్తుందని ధర్మశాస్త్రాలు పేర్కొంటున్నాయి.

శ్రద్ధతో చేసేదే శ్రాద్ధం

‘శ్రద్ధయా దీయతే శ్రాద్ధం’ అంటే శ్రద్ధతో సమర్పించేదే శ్రాద్ధమని అర్థం. మహాలయ సంకల్పంలో పితరులను వసు, రుద్ర, ఆదిత్య రూపాల్లో స్మరిస్తారు. పితృదేవతలకు అగ్నిముఖం, బ్రాహ్మణ భోజనం, పిండప్రదానం, ఉపవాసం వంటి విధానాల్లో శ్రాద్ధకర్మలు నిర్వహించవచ్చని పండితులు చెబుతున్నారు. తండ్రి మరణించినవారే మహాలయ పక్షం నిర్వహించడానికి అర్హులని సంప్రదాయం పేర్కొంటోంది. తండ్రి జీవించి ఉండి తల్లి మరణించిన సందర్భంలో శ్రాద్ధం చేయవచ్చని, అయితే నువ్వులతో తర్పణం చేయకూడదని ధర్మశాస్త్రాలు సూచిస్తున్నాయి.

ఆయా తిథులకు ప్రత్యేక ప్రాధాన్యం

మహాలయ పక్షంలోని వివిధ తిథుల్లో శ్రాద్ధకర్మలకు ప్రత్యేక ఫలితాలను ధర్మశాస్త్రాలు పేర్కొంటున్నాయి.

పాడ్యమి: ధనసంపద

విదియ: రాజయోగం, సంపద

తదియ: శత్రునాశనం

పంచమి: ఉత్తమ లక్ష్మీప్రాప్తి

షష్ఠి: శ్రేష్ఠ గౌరవం

సప్తమి: యజ్ఞం చేసిన పుణ్యఫలం

అష్టమి: సంపూర్ణ సమృద్ధి, బుద్ధిప్రాప్తి

నవమి: విస్తారమైన సంపద

దశమి: ధాన్య, పశుసంపద వృద్ధి

ఏకాదశి: శ్రేష్ఠమైన దానఫలం

ద్వాదశి: సమాజాభివృద్ధి, ఆహారభద్రత

త్రయోదశి: ఐశ్వర్యం, దీర్ఘాయువు, ఆరోగ్యం

చతుర్దశి: శత్రుభయం నుంచి విముక్తి

అమావాస్య: అన్ని కోరికలు నెరవేరుతాయని విశ్వాసం

ప్రత్యేక సందర్భాల్లో ప్రత్యేక తిథులు

మహాలయ పక్షంలోని ద్వాదశి రోజున సన్యాసులకు మహాలయం ఏర్పాటు చేసే సంప్రదాయం ఉంది. బలవన్మరణం పొందినవారు, శస్త్రప్రయోగం లేదా విషప్రయోగం వల్ల మరణించినవారికి చతుర్దశి రోజున శ్రాద్ధం నిర్వహిస్తారు. భర్త జీవించి ఉండగానే మరణించిన సువాసినీ స్త్రీకి నవమి తిథిన శ్రాద్ధం చేయాలని చెబుతారు. కుమార్తె తన కుమారుడి ద్వారా తల్లిదండ్రులకు శ్రాద్ధం చేయించాలనుకుంటే ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి రోజున నిర్వహించే సంప్రదాయం ఉంది. సాధారణంగా పితృతిథి రోజునే ఆర్తీకం నిర్వహిస్తారు. మహాలయ పక్షంలోని ప్రతి రోజూ పితృప్రీతికరమైనదిగా భావిస్తారు. తమ పితృదేవతలను స్మరించుకుంటూ శ్రద్ధతో శ్రాద్ధకర్మలు, తర్పణాలు నిర్వహించడం ద్వారా పితృదేవతల అనుగ్రహం లభిస్తుందన్నది సంప్రదాయ విశ్వాసం.

P

Written By

Pradeep

Reporter

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు