Mars Transit 2026 | జ్యోతిషశాస్త్రంలో గ్రహాల సంచారానికి ప్రత్యేక స్థానం ఉంది. ఒక గ్రహం ఒక రాశి నుంచి మరో రాశిలోకి మారిన సమయంలో.. ఆ గ్రహం ప్రభావం ఆయా రాశులపై భిన్నంగా ఉంటుంది. కుజుడు శుక్రవారం కర్కాటకరాశిలోకి ప్రవేశించాడు. కర్కాటకరాశికి చంద్రుడు అధిపతి. దీంతో కర్కాటకంలో కుజుడి సంచారం ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు ఇప్పటికే గురువు కర్కాటకరాశిలో సంచరిస్తున్నాడు. దీంతో కర్కాటకంలో కుజుడు, గురువు కలవడం ద్వారా గ్రహాల కలయిక ఏర్పడుతుంది. ఈ కలయికను జ్యోతిష్యంలో శుభప్రదమైందిగా పేర్కొంటారు. అయితే, కర్కాటకరాశి కుజుడికి నీచరాశి కావడంతో కుజుడి ప్రభావంలో కొంత తగ్గుదల ఉంటుంది. ఈ నేపథ్యంలో కుజుడి కర్కాటక సంచారం 12 రాశులపై భిన్నమైన ప్రభావాన్ని చూపనుంది. కొందరికి ఆర్థికంగా లాభాలు, కొత్త అవకాశాలు లభించే సూచనలు ఉండగా.. మరికొందరికి ఆరోగ్యం, ఖర్చులు, కుటుంబం, ఉద్యోగం వంటి అంశాల్లో అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితులు ఉంటాయి.
మేషరాశి
మేషరాశి నాలుగో ఇంట కుజుడు సంచరిస్తున్నాడు. ఈ సమయంలో శక్తి, సామర్థ్యం కొంత తగ్గినట్లు అనిపించే అవకాశం ఉంది. చేపట్టిన పనుల్లో నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా ముందుకు సాగాలి. చిన్నపాటి అజాగ్రత్త కూడా సమస్యలకు కారణమయ్యే అవకాశం ఉన్నందున ముఖ్యమైన పనుల్లో అప్రమత్తత అవసరం. ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు. శారీరక, మానసిక ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధ పెట్టాలి.
వృషభరాశి
వృషభరాశి మూడో స్థానంలో కుజుడు సంచరిస్తాడు. ఈ సమయంలో ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. వ్యాపారంలో నిర్లక్ష్యానికి తావివ్వకూడదు. చేపట్టిన పనులను పూర్తి చేయాలంటే కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. ప్రయత్నాలను మధ్యలో వదిలేయకుండా పట్టుదలతో ముందుకు సాగితే పనులు పూర్తిచేసే మెరుగైన ఫలితాలు కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి.
మిథునరాశి
మిథునరాశి రెండో స్థానంలో కుజ సంచారం జరుగుతోంది. ఈ సమయంలో ప్రత్యర్థుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఆర్థిక వ్యవహారాలతో పాటు మాట్లాడే మాటల్లోనూ జాగ్రత్త అవసరం. ముఖ్యమైన విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఓపికగా వ్యవహరించాలి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు అవసరమైనప్పటికీ.. ఆదాయానికి సంబంధించిన లాభాలు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి.
కర్కాటకరాశి
కర్కాటక రాశిలోనే కుజుడు సంచరించనున్నాడు. కర్కాటకం కుజుడికి నీచరాశి కావడంతో ఈ సంచారం కర్కాటకరాశి వారికి అంతగా అనుకూలంగా ఉండకపోవచ్చు. కుటుంబంలో ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉంది. చిన్న విషయాలు వివాదాలుగా మారే పరిస్థితులు ఏర్పడవచ్చు. కోపంలో మాట్లాడే మాటలపై నియంత్రణ కోల్పోయే అవకాశం ఉన్నందున సంయమనం పాటించడం ఉత్తమం. ఇప్పటికే ఏదైనా సమస్య ఉన్నట్లయితే ఈ కాలంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యులతో అనవసర వాదనలకు దూరంగా ఉండటం అవసరం.
సింహరాశి
సింహరాశి వారికి కుజుడు పన్నెండో స్థానంలో సంచరిస్తాడు. ఈ కాలంలో కెరీర్, ఉద్యోగం, పరీక్షలకు సంబంధించిన విషయాలపై ఆందోళన పెరుగుతుంది. అనవసర ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. ఆదాయం, ఖర్చుల మధ్య సమతుల్యత పాటించాలి. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో నిర్లక్ష్యం చేయకుండా ఖర్చులను నియంత్రించుకోవడం అవసరం.
కన్యారాశి
కన్యారాశి వారికి కుజుడి సంచారం మిశ్రమ ఫలితాలను ఇవ్వనుంది. ఒకవైపు ఆర్థిక లాభాలు వచ్చే అవకాశం ఉండగా.. మరోవైపు ఖర్చులు కూడా అదే స్థాయిలో పెరిగే పరిస్థితులు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ, వృత్తి విషయాల్లో మరింత శ్రద్ధ పెట్టాలి. పని విషయంలో నిర్లక్ష్యం చేస్తే ప్రత్యర్థులు దానిని తమకు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రతి అంశాన్ని పరిశీలించి ముందుకు సాగడం మంచిది.
తులరాశి
తులరాశి పదో స్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు. ఈ స్థానం కర్మ, వృత్తి రంగాలకు సంబంధించినది కావడంతో ఉద్యోగం, వ్యాపార వ్యవహారాల్లో ప్రత్యేక శ్రద్ధ అవసరం. వ్యాపారంలో కొత్త ప్రణాళికలు అమలు చేసే ముందు వాటి గురించి పూర్తిగా ఆలోచించాలి. ముఖ్యమైన బాధ్యతలను నిర్లక్ష్యం చేయకుండా సమర్థంగా నిర్వహించాల్సి ఉంటుంది. పని విధానంలో కొన్ని మార్పులు చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడవచ్చు. అదే సమయంలో కెరీర్‌లో ముందుకు వెళ్లేందుకు కొత్త అవకాశాలు కూడా లభించే అవకాశం ఉంది. సరైన దిశలో కష్టపడి పనిచేయడంతో పాటు విషయాలను అర్థం చేసుకుని నిర్ణయాలు తీసుకుంటే గౌరవం పెరిగే అవకాశాలు ఉన్నాయి. కొత్త అవకాశాలు కూడా ఒకేసారి ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తాయి.
వృశ్చికరాశి
వృశ్చికరాశి వారికి కుజుడి సంచారం కొన్ని విషయాల్లో సానుకూల ఫలితాలను అందించవచ్చు. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు ఒక్కసారిగా పూర్తయ్యే అవకాశం ఉంది. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న పనులు ముందుకు కదిలే పరిస్థితులున్నాయి. అయితే, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో తొందరపడకుండా ఓపికతో వ్యవహరించడం అవసరం. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం ద్వారా ఈ కాలాన్ని ప్రయోజనకరంగా మలుచుకునే అవకాశం ఉంటుంది.
ధనుస్సురాశి
ధనుస్సురాశి వారికి కుజుడి సంచారం కొన్ని అంశాల్లో సానుకూల ఫలితాలను ఇవ్వనుంది. నిలిచిపోయిన పనుల్లో కదలిక వస్తుంది. చాలాకాలంగా పూర్తికాని పనులు అకస్మాత్తుగా కొలిక్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం తొందరపాటు వద్దు. పరిస్థితులను పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే ముందుకు సాగడం మంచిది.
మకరరాశి
మకరరాశి వారికి ఈ సమయంలో ప్రతికూల ఆలోచనలను నియంత్రించుకోవడం అవసరం. కొంతకాలంగా నిలిచిపోయిన పనులు మళ్లీ వేగం పుంజుకునే అవకాశం ఉంది. కష్టమైన పరిస్థితులు ఎదురైనా లక్ష్యాలపై దృష్టి నిలిపి ఉంచాలి. ఏకాగ్రతతో ముందుకు సాగడం ద్వారా సమస్యలను మెరుగ్గా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది.
కుంభరాశి
కుంభరాశి వారు చిన్న చిన్న విషయాల గురించి ఎక్కువగా ఒత్తిడికి గురికాకుండా పరిస్థితిని అర్థం చేసుకుని ముందుకు సాగాలి. పూర్తి సమాచారం లేకుండా కొత్త ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టకూడదు. ఇతరులతో సంబంధాలను సానుకూలంగా కొనసాగించేందుకు ప్రయత్నించాలి. కొన్ని ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన నిర్ణయాలు అనుకూలంగా మారే అవకాశం ఉంది. అదనపు ఆదాయానికి సంబంధించిన అనేక అవకాశాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. వచ్చిన అవకాశాలను పరిశీలించి ముందుకు వెళ్లడం ద్వారా ప్రయోజనం పొందవచ్చు.
మీనరాశి
మీనరాశి వారికి ఆర్థిక విషయాల్లో కొంత ఉపశమనం లభించే అవకాశం ఉంది. పెద్ద మొత్తంలో ఆర్థిక నష్టం వాటిల్లుతుందనే భయం కొంతవరకు తగ్గుతుంది. ఆర్థిక లాభాలకు సంబంధించిన అవకాశాలు పెరుగుతాయి. గతంతో పోలిస్తే ఆర్థిక పరిస్థితి మెరుగుపడే సూచనలు ఉన్నాయి. కష్ట సమయాల్లో జీవిత భాగస్వామి లేదా ప్రేమ భాగస్వామి నుంచి పూర్తి సహకారం లభిస్తుంది. కుటుంబ సభ్యుల నుంచి కూడా మద్దతు ఉంటుంది.




















