Samasaptak Yogam | వేద జ్యోతిష్యంలో సూర్యుడిని గ్రహాలకు రాజుగా.. శనిని కర్మ, న్యాయానికి కారకుడిగా భావిస్తారు. పురాణాల ప్రకారం సూర్యుడు, శని తండ్రీకొడుకులు. వీరిద్దరి స్వభావాల్లో భారీగా తేడాలు ఉండడంతో శత్రుగ్రహాలుగా పేర్కొంటారు. ఈ రెండు గ్రహాలు ఒకదానికొకటి ఏడో స్థానంలో ఉన్నప్పుడు సమసప్తక యోగం ఏర్పడుతుంది. ప్రస్తుతం సూర్యుడు కన్యారాశిలోకి ప్రవేశించడంతో సూర్యుడు, శని మధ్య ఈ సమసప్తక స్థితి ఏర్పడింది. ఈ నెల 17న సూర్యుడు కన్యారాశిలోకి ప్రవేశించాడు. శని మీనరాశిలో సంచరిస్తున్నాడు. దీంతో సూర్యుడు కన్యలో, శని మీనంలో ఉండగా.. రెండు గ్రహాలు ఏడో స్థానంలో ఉన్నాయి. ఈ గ్రహస్థితినే సూర్య–శని సమసప్తక యోగంగా పరిగణిస్తారు. ఈ యోగం ప్రభావంతో కొన్ని రాశుల వారికి రాబోయే రోజుల్లో ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, ఆర్థిక వ్యవహారాలు, కుటుంబ సంబంధాల్లో జాగ్రత్త అవసరమని జ్యోతిష్య విశ్లేషణ పేర్కొంటోంది. ముఖ్యంగా మేషం, తుల, మీన రాశుల వారు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది.
మేషరాశి
మేషరాశి ఆరో స్థానంలో సూర్యుడు ఉన్నాడు. శని పన్నెండో స్థానంలో ఉంటాడు. ఈ రెండు గ్రహాలు పరస్పరం ఎదురెదురుగా ఉండడంతో ఉద్యోగ రంగంలో ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. పని ప్రదేశంలో సహోద్యోగులతో కొన్ని విషయాల్లో అభిప్రాయ భేదాలు తలెత్తే అవకాశం ఉంది. ఈ కారణంగా పనుల వేగం కొంత తగ్గే పరిస్థితులు ఏర్పడవచ్చు. చిన్న విషయాలు పెద్ద సమస్యలుగా మారకుండా వ్యవహరించడం కీలకం. వ్యాపార రంగంలో భాగస్వామ్యంతో పనిచేసే వారు మరింత అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీల విషయంలో తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండాలి. ఒప్పందాలు, ఇతర ముఖ్యమైన పత్రాలను పూర్తిగా పరిశీలించిన తర్వాతే సంతకాలు చేయడం మంచిది. ఆరోగ్య పరంగా కొందరికి తలనొప్పి, జీర్ణ సంబంధిత సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. రోజువారీ జీవన విధానంలో క్రమశిక్షణ పాటించడం, తగిన విశ్రాంతి తీసుకోవడం అవసరం. మానసిక ప్రశాంతత కోసం యోగా, ధ్యానం వంటి సాధనలను రోజువారీ దినచర్యలో భాగం చేసుకోవచ్చు.
పరిహారం : ప్రతిరోజూ ఉదయం రాగి పాత్రతో సూర్యుడికి నీటిని సమర్పించాలి.
తులరాశి
తులరాశి పన్నెండో స్థానంలో సూర్యుడు సంచరిస్తుండగా.. శని ఆరో స్థానంలో ఉంటాడు. ఈ గ్రహస్థితి కారణంగా ఎంత కష్టపడి పనిచేసినా ఆశించిన ఫలితాలు రావడానికి కొంత సమయం పట్టే పరిస్థితులు ఏర్పడవచ్చు. ఈ సమయంలో పనులను తొందరగా పూర్తి చేయాలనే ఆత్రుత కంటే.. ఓపికతో ముందుకు సాగడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఆలస్యంగా ఫలితాలు వచ్చినా ప్రయత్నాలను కొనసాగించాల్సి ఉంటుంది. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్యనూ నిర్లక్ష్యం చేయకూడదు. సమస్యలు కనిపించినప్పుడు తగిన శ్రద్ధ తీసుకోవడం అవసరం. తులరాశి వారికి సామాజిక, ఉద్యోగ సంబంధిత సంభాషణల్లో కూడా సంయమనం అవసరం. ఆలోచించకుండా మాట్లాడటం వల్ల వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో మాటలు ప్రతిష్ఠకు ఇబ్బంది కలిగించే పరిస్థితులకు దారితీయవచ్చు. అందువల్ల సహోద్యోగులు, ఉన్నతాధికారులు, ఇతర వ్యక్తులతో మాట్లాడేటప్పుడు పరిస్థితిని అర్థం చేసుకుని స్పందించడం మంచిది.
పరిహారం : ప్రతిరోజూ శివుడిని పూజించి శివ మంత్రాన్ని జపించాలి.
మీనరాశి
మీనరాశిలో శని సంచరిస్తున్నాడు. సూర్యుడు కన్యారాశిలోకి ప్రవేశించడంతో మీనరాశి వారికి సూర్యుడు ఏడో స్థానంలో సంచరిస్తాడు. దీంతో సూర్యుడు–శని పరస్పరం ఎదురెదురుగా ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ గ్రహస్థితి ముఖ్యంగా వైవాహిక జీవితంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. చిన్న చిన్న విషయాలకే భార్యాభర్తల మధ్య ఉద్రిక్తతలు పెరిగే పరిస్థితులు ఏర్పడవచ్చు. అనవసర వాదనలకు దూరంగా ఉండటం, జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించడం అవసరం. ఆర్థిక విషయాల్లోనూ జాగ్రత్తగా వ్యవహరించాలి. పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం, ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించడం మంచిది. పని ప్రదేశంలో ఉన్నతాధికారుల దృష్టి మీ పనితీరుపై ఉండే అవకాశం ఉంది. అప్పగించిన బాధ్యతలను నిర్లక్ష్యం చేయకుండా సమయానికి పూర్తి చేయడం ముఖ్యం. పనిలో చిన్న తప్పిదాలు కూడా ఇబ్బందులకు దారితీయకుండా ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. బాధ్యతలను సీరియస్‌గా తీసుకుని పనిచేయడం అవసరం. ఆరోగ్య పరంగా కొందరికి ఒత్తిడి, నిద్రకు సంబంధించిన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. తగిన విశ్రాంతి తీసుకోవడంతో పాటు రోజువారీ దినచర్యలో సమతుల్యత పాటించాలి.
పరిహారం: ప్రతిరోజూ భక్తితో గాయత్రీ మంత్రాన్ని జపించాలి.
సమసప్తక యోగం అంటే?
జ్యోతిష్యంలో రెండు గ్రహాలు పరస్పరం ఏడో స్థానంలో ఉన్నప్పుడు వాటి మధ్య సమసప్తక సంబంధం ఏర్పడుతుంది. ప్రస్తుతం శని మీనరాశిలో ఉండగా.. సూర్యుడు కన్యారాశిలోకి ప్రవేశించాడు. మీనం నుంచి ఏడో రాశి కన్య. అలాగే కన్యారాశి నుంచి ఏడో రాశి మీనం. అందువల్ల శని, సూర్యుడు పరస్పరం ఏడో స్థానాల్లో ఉండటంతో సూర్య–శని సమసప్తక యోగం ఏర్పడింది. సూర్యుడు అధికారం, ఆత్మవిశ్వాసం, తండ్రి, ఉద్యోగం వంటి అంశాలకు కారకుడిగా.. శని కర్మ, క్రమశిక్షణ, న్యాయం, బాధ్యతలకు కారకుడిగా భావిస్తారు. ఈ రెండు గ్రహాలు ఎదురెదురుగా ఉన్న సమయంలో వాటి ప్రభావం ఆయా రాశుల జాతకాల్లో భిన్నంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం పేర్కొంటాయి. ప్రస్తుతం ఏర్పడిన ఈ గ్రహస్థితి నేపథ్యంలో మేషం, తుల, మీన రాశుల వారు ముఖ్యంగా ఉద్యోగం, ఆరోగ్యం, ఆర్థిక వ్యవహారాలు, కుటుంబ సంబంధాల్లో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన కాలామని పండితులు పేర్కొంటున్నారు.




















